మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్‌సిఆర్‌బి గణాంకాలతో తెలంగాణలో నేరాల పరిస్థితి భయానకంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తా రు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రా ష్ట్రంగా తెలంగాణ మారడం అత్యంత ఆందోళనకరమన్నారు. సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసులు, మహిళల భద్రతపై ఎన్‌సిఆర్‌బి గణాంకాలతో ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని కరీంనగర్ నగల దుకాణం దొంగలను ఇప్పటికి పట్టుకోలేక సాకులు చెబుతున్నారని అందరూ చూస్తుండగానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడి జరిగితే, శుక్రవారం ఐఏఎస్ క్వార్టర్స్ లో ఏకంగా ఐపిఎస్ అధికారిని భార్య హత్య చేశారన్నారు. సిపి సుమతి ఆపరేషన్‌తో మహిళల భద్రత బట్టబయలైందని ముఖ్యమంత్రిగా, హోమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని హరీష్‌రావు ఓ ప్రకటనలో విమర్శించారు. 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయని, ఇది దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అధిక శాతమని ఆయన తెలిపారు. 2023తో పోలిస్తే సైబర్ నేరాలు దాదాపు 49 శాతం పెరగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 2024లో తెలంగాణలో 25,500 మంది మిస్సింగ్ కేసులు నమోదవ్వగా, వారిలో వేలాదిమంది ఇప్పటికీ ఆచూకీ లభించలేదన్నారు.

ప్రతి రోజు సగటున ఆరుగురు చిన్నారుల అదృశ్యం

ప్రతి రోజు సగటున ఆరుగురు చిన్నారులు అదృశ్యమవుతున్న పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు. చిన్నారులపై నేరాలు కూడా భారీగా పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో రాష్ట్రంలో చిన్నారులపై 6,767 కేసులు నమోదయ్యాయని, కిడ్నాప్‌నకు గురైన చిన్నారుల్లో అధిక శాతం బాలికలేనని ఆయన చెప్పారు. మహిళలపై నేరాలు పెరిగాయని, 2022లో 22,066 కేసులు ఉండగా 2024లో అవి 24,495కు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 2024లో 423 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు కావడం అత్యంత ఆందోళనకరమన్నారు. రాష్ట్రంలో మొత్తం కాగ్నిజబుల్ నేరాలు కూడా భారీగా పెరిగాయన్నారు. 2022లో 1,65,830 కేసులు ఉండగా, 2024 నాటికి అవి 2,17,976కు చేరుకున్నాయన్నారు. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో నేరాల రేటు 568.9గా ఉండగా, దేశ సగటు 418.9 మాత్రమే ఉండటం రాష్ట్ర పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోందన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన కేసులను కూడా వేగంగా చేధించేవారని, కానీ, ప్రస్తుతం కరీంనగర్‌లో జరిగిన పట్టపగలు నగల దుకాణం దోపిడీ ఘటనలో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమన్నారు.