
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పరీక్షా సమయానికి గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇఎపిసెట్ పరీక్షలు సోమవారం(మే 4) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమ, మంగళవారాలో(మే 4,5) తేదీలలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి, మే 9, 10, 11 తేదీల్లో జరుగనున్న ఇంజనీరింగ్ విభాగానికి ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగన్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మే 4,5 తేదీలలో జరుగనున్న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి జరుగనున్న ఇఎపిసెట్ పరీక్షలకు 106 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గురువారం జరిగే ఉదయం సెషన్‌కు 30,333 మంది విద్యార్థులు హాజరుకానుండగా, మధ్యాహ్నం సెషన్‌ఎకు 30,253 మంది, శుక్రవారం జరిగే ఉదయం సెషన్‌కు 30,372 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు టిజిఇఎపిసెట్ కన్వీనర్ కె.విజయకుమార్‌రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాలలో ఇన్విజిలేటర్లు ఆయా పరీక్ష ప్రశ్నలకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేయకూడదని అన్నారు. పరీక్షా కేంద్రంలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే మాత్రమే విద్యార్థులు ఇన్విజిలేటర్లకు తెలియజేయాలని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టారు. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడీ ప్రూఫ్, బాల్ పాయింట్ పెన్‌ను తప్పనిసరిగా తెచ్చుకోవాలి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. కంప్యూటర్ లేదా సాఫ్ట్‌వేర్ సమస్యలు వస్తే ఇన్విజిలేటర్‌కు వెంటనే తెలపాలని, అదనపు సమయం కేటాయిస్తారు. ఈసారి పరీక్ష ముగియగానే స్క్రీన్‌పై మార్కులు కనిపించే విధానం అమలు చేస్తున్నారు.
రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు
రోజుకు రెండు సెషన్ల చొప్పున ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. పరీక్షా సమయానికి గంటన్నర ముందు అంటే ఉదయం 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్‌కు 1.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. కనీసం 20 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి సూచించారు. విద్యార్థుల వివరాల పరిశీలనకు 20 నిమిషాల సమయం పడుతుందని, కాబట్టి విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు ఉదయం సెషన్‌కు 9 గంటల వరకు రిపోర్టింగ్ చేయాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు.














