మన తెలంగాణ/సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తం గా జనాభా లెక్కల షెడ్యూల్‌ను సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హొళికేరి ప్రకటించా రు. తెలంగాణలో తొలిసారి, దేశంలో పదహారేండ్ల తర్వాత జనగణన జరుగుతున్నదని ఆమె వెల్లడించారు. జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్టు, డిజిటల్‌గా చేయడం చరిత్రాత్మకమని ఆమె పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఏప్రిల్ 26 నుంచి మే 11వ తేదీ వరకు స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను అమల్లోకి తీసుకువస్తున్నట్టు, అందులో 33 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, కులాల సమాచారానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబు తెలపాలని భారతి హొళికేరి తెలిపారు. ప్రతి ఒ క్కరూ తమ బాధ్యతగా జనగణనకు వివరా లు అందజేసి సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఒక రిజిష్టర్ మొబైల్ ద్వారా ఒకే కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని, ఒక కుటుంబ యజమాని పేరు ఒక్కసారే నమోదు చేయాలనీ, తప్పుడుగా నమోదు చేస్తే మార్చడానికి వీల్లేదని ఆమె స్పష్టం చేశారు.

డాక్యుమెంట్లు అవసరం లేదు..

కుటుంబాల వివరాలు నమోదు చేసేటప్పుడు లేదా వివరాలను ఎన్యూమరేటర్‌కు తెలియజేసేటప్పుడు ఆ వివరాలకు ఎలాంటి రుజువులు, నిర్ధారించే డాక్యుమెంట్ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని డీసీఓ భారతి హొళికేరి స్పష్టం చేశారు. జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని, ఎక్కడా పెన్నూ కాగితం వాడరని ఆమె చెప్పారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా సమర్పించేందుకు ఉద్దేశించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ హిందీ, ఇంగ్లీషు సహా 16 భాషల్లో లభ్యమవుతుందని చెప్పారు. మొబైల్ నెంబర్, ఇతర మౌలిక వివరాలను పోర్టల్‌లో పేర్కొన్న తర్వాత ప్రతి కుటుంబానికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ లభిస్తుందని ఆమె తెలిపారు. ఎన్యూమరేటర్ క్షేత్ర పర్యటనకు వచ్చినపుడు ఆ ఐడీ చెప్తే ఏమైనా సవరణలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. జనగణన మొత్తం రెండు దశల్లో జరుగనున్నదని, మొదటి దశలో ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) చేయడం, ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి కుటుంబ వివరాలు సేకరిస్తారన్నారు. బడి, గుడి, ఆస్పత్రి, గుడిసె, అద్దె ఇల్లు, కాంప్లెక్స్‌లు, వ్యాపారసంస్థలు ఇలా ఇండ్ల గణన, రెండో దశలో వ్యక్తిగత సమాచారం సేకరించనున్నామని ఆమె తెలిపారు.

వెబ్‌సైట్‌లోనూ నమోదు..

తుది దశలో జనగణన వివరాల సేకరణ 2027 ఫిబ్రవరి 9 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు నిర్వహించనున్నట్టు ఆమె చెప్పారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదుకు 15 రోజుల గడువు ఉన్నదనీ, మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలను సేకరించి నమోదు చేస్తారని ఆమె తెలిపారు. జనగణనకు సంబంధించి ఎలాంటి సమాచారం కోసమైనా 1855 హెల్ప్ లైన్ నెంబర్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించవచ్చని భారతి పేర్కొన్నారు. ఒక పోర్టల్ ద్వారా ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశాన్ని, నేరుగా కుటుంబమే తమ కుటుంబ పూర్తి వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా https://se.census.gov.inలో వెబ్‌సైట్ అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందని ఆమె చెప్పారు.

గణనతోనే సంక్షేమ పథకాలు..

జనాభా గణన సమగ్రంగా జరిగితేనే జనాభాను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, కొత్త కొత్త పాలసీలను ప్రవేశపెట్టి అమలుపరిచే అవకాశాలుంటాయని భారతి హొళికేరి తెలిపారు. ప్రతీ పౌరుడు తమ వివరాలను స్వీయ నమోదులో లేదా ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు తెలియజేయాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎన్యూమరేటర్లకు సహకరించాలని కోరారు.

ఒక యూనిట్‌గా క్యూర్..

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పూర్తిగా ఒక యూనిట్‌గానే జనగణన జరుగుతుందని ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణణ్ తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ప్రాంతాల్లోని 60 సర్కిళ్లు, 300 వార్డులతో పాటు కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో జనగణన జరుగుతుందని కర్ణణ్ చెప్పారు. ఒక్కో సర్కిల్‌కు చార్జ్ ఆఫీసర్‌గా డిప్యూటీ కమిషనర్ వ్యవహరించనున్నారని ఆయన తెలిపారు. వార్డు యూనిట్‌గానూ హౌస్ లిస్టింగ్ చేయనున్నారని కర్ణణ్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రిన్సిపల్ సెస్సెస్ ఆఫీసర్‌గానూ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు అడిషనల్ సెన్సెస్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారని తెలిపారు.