
ఉప్పల్: ఫ్లైఓవర్ పనుల కారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డులో తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్ టిసి అధికారులు ప్రకటించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద హన్మకొండ వైపు వెళ్ళే బస్సులు ఆగే బస్టాండ్‌ను నల్లచెరువు వద్ద ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచే నల్లచెరువు వద్ద బస్సులు ఆగుతాయని అధికారుల ప్రకటించారు. బోడుప్పల్ వైపు నుండి వచ్చే వాహనాలు ఏషియన్ థియేటర్ వద్ద నుండి భగాయత్ లే-అవుట్ ద్వారా నాగోల్ చేరుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ నుండి నాచారం ద్వారా చెంగిచర్ల చేరుకుని అక్కడి నుండి జాతీయ రహదారి చేరుకోవాలని, చిన్న వాహనాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుండి రహదారికి చేరుకోవాలని సూచించారు. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని రోజులు ఉంటాయో, ఫ్లైఓవర్ పనులు ఎన్నటికి పూర్తి చేస్తారోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.












