
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యా ప్తంగా ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయనే ప్రచారంతో వాహనదారుల అధిక వినియోగం కారణంగా హైదరాబాద్ నగరంతో సహా అన్ని జిల్లాల్లో పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. ఆ యా బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అందుబాటులో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గంటల కొ ద్దీ వేచి చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో డీజిల్ సరఫ రా లేకపోవడంతో వ్యవసాయ సంబంధి త పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోం ది. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంకు లు ఎక్కువగా మూతపడుతున్నాయని, ఇంధన సరఫరాలో ఆలస్యం కారణంగా నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు.
హైదరాబాద్‌లో కొన్ని చోట్ల బంకులు మూతపడుతున్నా, మరికొన్ని చోట్ల అందుబాటులో ఉండడంతో కొంత ఊరట కలుగుతోంది. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయనే ప్రచారంతో ఆయిల కంపెనీలు సరఫరా తగ్గించాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో సరఫరా తక్కువ ఉండడం, ఈ ప్రచారంతో వినియోగదారులు అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్ల ఆకస్మికంగా కొరత ఏర్పడింది. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెరుగుతాయనేది వాస్తవం కాదని కొట్టి పారేస్తున్నాయని, ఇది కేవలం తప్పుడు ప్రచారమని స్పష్టం చేశాయి. ఇక ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా చమురు సరఫరా 126 శాతం పెంపు
రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం రంగంలో దిగింది. వాహనదారులకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ సరఫరా అయ్యేలా పౌర సరఫరాల శాఖ ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చమురు సరఫరాను 126 శాతం పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల స్థానిక పెట్రోల్ బంకుల్లో తలెత్తిన రద్దీని తగ్గించడానికి అధికారులు వేగంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంధన సరఫరాలో సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర మార్కెట్లో సరిపడా నిల్వలు ఉంచాలని పెట్రోల్, డీజిల్ కంపెనీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. దీంతో సరఫరాను వేగవంతం చేయడానికి, డీలర్ల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా 3,100 ఇంధన సరఫరా ట్యాంకర్ల వాహనాలను ఆఘమేఘాల మీద ఏర్పాటు చేశారు.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం: స్టీఫెన్ రవీంద్ర
కాగా రాష్ట్రoలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం ప్రకటించారు. సోమవారం 27వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్ , డీజిల్‌లను 29,939 కిలో లీటర్లు సరఫరా చేసినట్లు వివరించారు. సగటున రోజుకు 5,883 కిలో లీటర్లు పెట్రోల్, 7,348 కిలో లీటర్లు డీజిల్‌కు డిమాండ్ ఉండేదని ఆయన స్పష్టం చేశారు. అయితే 27న 11,490 కిలో లీటర్లు పెట్రోల్, 18,449 కిలో లీటర్లు డీజిల్ ను వాహనదారులకు సరఫరా చేసినట్లు రవీంద్ర పేర్కొన్నారు. సరఫరాను క్షేత్ర స్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అపోహలతో పెట్రోల్, డీజిల్ ను నిల్వచేసుకోవద్దని ఆయన వినియోగదారులకు సూచించారు. పెట్రోల్ బంకుల్లో నిల్వలు అయిపోకముందే వాటికి ఇంధనం చేరేలా అధికారుల పర్యవేక్షణ పెంచామని వివరించారు. ప్రతి మూడు గంటలకోసారి బంకుల నుంచి నిల్వల వివరాలు తెప్పించుకోవడంతో పాటు, ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడాలని కీలక ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. దీనివల్ల పంట కోతలు, ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకం కలగదని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్‌లో 43 శాతం పెరిగిన ఇంధన సరఫరా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనే ఇంధన సరఫరాలో కొరత రాకుండా 43 శాతం మేర పెంచించింది. నగరంలో డీజిల్ నిల్వలను 46 శాతం అంటే 3,393 నుంచి 4,957 కిలో లీటర్లకు, పెట్రోల్ నిల్వలను 40 శాతం అంటే 3,908 నుంచి 5,466 కిలో లీటర్లకు పెంచింది. ఇంత భారీగా సరఫరా పెంచడం వల్ల వాహనదారులకు సరఫరాలో ఇబ్బంది లేకుండా మంచి ఫలితాలు వస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 27 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీ డీజిల్ పంపిణీ 151 శాతం పెరిగి 7,348 కిలో లీటర్ల నుంచి 18,449 కిలో లీటర్లకు పెరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ పంపిణీ కూడా దాదాపు రెట్టింపు అయ్యింది. ఇది 95 శాతం పెరిగి 5,883 కిలో లీటర్ల నుంచి 11,490 కిలో లీటర్లకు చేరుకుందని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని పౌర సరఫరాల శాఖ ప్రజలకు హామీ ఇచ్చింది. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ఎప్పటిలాగే తమకు అవసరమైన మేరకే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని అధికారులు కోరుతున్నారు. ప్రజల, రైతుల అవసరాలకు సరిపడా నిల్వలు పెట్రోల్ బంకుల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
పెట్రోల్ బంకుల దగ్గర ఇలా ఊహించని రద్దీకి ఇవే కారణాలు
పెట్రోల్ బంకుల దగ్గర ఊహించని రద్దీకి మూడు కారణాలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి కారణం పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటరుకు రూ.150 కు పెంచారు. దీంతో పెద్ద మొత్తంలో కొనే వ్యాపారులు, లీటరు రూ.95 కే దొరుకుతున్న సాధారణ పబ్లిక్ పెట్రోల్ బంకులకు వచ్చి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. రెండవ కారణం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో సరఫరా సమస్యలు ఉన్నాయి. దీనివల్ల పక్క రాష్ట్రాల ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం ఖమ్మం, నిర్మల్ లాంటి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు క్యూ కడుతున్నారు. కాగా మూడవ కారణం ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే తప్పుడు పుకార్ల వల్ల సాధారణ ప్రజలు భయపడి, అవసరానికి మించి కొని కొనుగోలు చేసుకుని దాచుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఉన్న నిల్వలు వేగంగా అయిపోతున్నాయి. ఈ విషయాలు తమ పరిశీలనలో స్పష్టమయ్యాయని పౌరసరఫరాల శాఖ పేర్కొంది.













