ఓఆర్‌ఆర్ తోండుపల్లి ఎగ్జిట్- 16 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. బొల్లి శివకుమార్ (37), భార్య బొల్లి లాస్య (30), కూతురు రిషిత (8), కోడెం శ్రీనివాస్ (40), భార్య శ్వేత (35) కుమారులు కృష్ణచంద్ర (9), కోడెం మాధవ్ (11)లు కలిసి యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నారు. తోండుపల్లి ఎగ్జిట్ 16కు దగ్గరలో ఓఆర్‌ఆర్‌పై ఆగి ఉన్న AP 39 UV0909 నెంబర్ గల లారీని వ్యాగనార్ TS 23 F 2298 గల కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఆమెను స్థానికులు హాస్పటల్‌కు తరలించారు. సంఘటనకు సంబంధించి చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపిన వివరాలు లా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారులోనుంచి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

సిరిసిల్ల ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, శ్వేత, శివ, లాస్య, చిన్నారి కృష్ణచంద్ర, మాధవ్, రిషికలు గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. నిన్న యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. అయితే, వీరు మారుతి వ్యాగనార్ కారులో తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. పెద్ద అంబర్‌పేట్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్‌పై తోండుపల్లి వద్దకు రాగానే ముందుగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతోవారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా లారీ కిందికి దూసుకెళ్లింది. ప్రమాదంలో శ్రీనివాస్, లాస్య, శివ, కృష్ణచంద్ర, మాధవ్, రిషిత, మృతిచెందగా శ్వేత తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో అటుగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ కారు ఆపి కారులో ఇరుక్కుపోయి ఉన్నవారిని వెలికితీసే ప్రయత్నం చేశాడు. కానీ, కారులో అప్పటికే ఆరుగురు వ్యక్తులు మృతి చెంది ఉన్నారు. లాస్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆమెను కారులో నుంచి బయటకుతీసి శంషాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, బియ్యం, నూకల లోడుతో నిండి ఉన్న లారీ తాడు ఒదలుగా అయ్యిందని, దాన్ని మళ్లీ కడుదామని పక్కకు ఆపగా ఈ ఘటన జరిగిందని లారీ డ్రైవర్ శ్రీనివాసులు తెలిపారు.