‘ఉద్యమాలెన్నీ వచ్చినా, సంపద, అధికారం మాత్రం ఆధిపత్య వర్గాలదే -కుల సర్వే రిపోర్ట్ ఒక ఉదాహరణ. -తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం భూమికోసం, నీటికోసం, ఉద్యోగాలకోసం జరిగినవే ఈ పోరాటాల ఫలితాలు మాత్రం సాంప్రదాయంగా అధికారం, భూమి, మూలధనం కలిగి ఉన్న ఆధిపత్య కులాలు చేజిక్కించ్చుకున్నవి. దీంతో సంఖ్య లో మెజారిటీగా ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు పోరాటాల్లో ముందుండి కూడా, ఫలితాల్లో మాత్రం వెనుకబడిపోయారు. ఇదే నిజాన్ని కుల సర్వే స్పష్టంగా అసలు స్వరూపం బయటపెట్టింది. సంఖ్యలో మెజారిటీ అయిన.. బహుజనులు సంపదలో, అధికారంలో మాత్రం మైనారిటీగా మిగిలిపోయిన వాస్తవాన్ని అది వెల్లడించింది. శ్రమ బహుజనులది, భోగాలు మాత్రం ఆధిపత్య కులాలవే అన్న చారిత్రక అసమానతను ఈ గణాంకాలు అద్దంలా చూపించాయి.

తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే రిపోర్టు (కులసర్వే రిపోర్ట్) -అర్ధసత్యాల రిపోర్ట్. తెలంగాణలో ఇటీవల విడుదలైన కులసర్వే రిపోర్ట్ ఒక సాధారణ గణాంక పత్రం కాదు. ఇది రాష్ట్రంలోని శక్తి సమీకరణాలను, వనరుల పంపిణీని, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని ప్రతిబింబించిన కీలక పత్రం. బహుజన సమాజం శతాబ్దాలుగా అనుభవిస్తున్న అసమానతలను సంపూర్ణంగా బహిర్గత పరిచిన పత్రం. అయితే, ఈ రిపోర్టును లోతుగా పరిశీలిస్తే ఇది చెప్పినదానికంటే, చెప్పనిది ఎక్కువగా కనిపిస్తుంది. జనాభా వ్యత్యాసాలు ఈ సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3.55 కోట్లు. కానీ జాతీయ జనాభా కమిషన్ అంచనా ప్రకారం 2024లో తెలంగాణ జనాభా 3.83 కోట్లు సుమారు 30 లక్షల జనాభా తగ్గింది. అలాగే కొన్ని ఒసి కులాల జనసంఖ్య పెరిగింది. ఉదాహరణకు రెడ్డి కులం జనాభా సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం 14,75,000. కానీ ఈ సర్వేలో 17,06,000 రావడం జరిగింది. వెలమ కుల జనాభా 2014 సర్వేలో 102,000, కానీ ఈసర్వేలో 143,000 జరిగింది.

కమ్మ కులం 2014 సర్వేలో జనాభా 258,291 ఇప్పుడు 367,226. ఈ విధంగా ఆధిపత్య కులాల జనాభా పెరగడం జరిగింది. అలాగే బిసి జనాభా శాతం తగ్గింది (61%నుంచి 56.33%కు, ఒసి జనాభా 11% నుంచి 15.79 % పెరిగింది. 2014 సర్వే వివరాలు ప్రకటించబడ లేవు, కులగణన ఇంత శాస్త్రీయంగా జరగలేదు. కాబట్టి ఈ వ్యత్యాసాలు అని కొందరు అనవచ్చును. కానీ అసలు నిజాలు 2027 సర్వేలో బయట పడతా యని ఆశించవచ్చును. తెలంగాణలో కులాలు 242 గా తేల్చింది. అందులో ఎస్‌సి కులాలు 59, ఎస్‌టి కులాలు 32, బిసి కులాలు 133 (ఒక అనాథ కులం ఎస్‌ఎల్ 1044 తీసుకోలేదు ) ఒసి కులాలు 18గా తేల్చింది. మొదటి సారిగా వెనుకబాటుతనాన్నీ కొలిచేటందుకు సంయుక్త వెనుకబాటు సూచిక (COMPOSITE BACKWARD NESS INDEX)ను 42 అంశాలమీద 124 మార్కులు ఇచ్చి కులాల వెనుకబాటుతనాన్ని కొలిచినారు

భూమిసంపద : ఎవరి చేతిలో? తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగినా, భూమి, సంపద, పరిశ్రమలు, వ్యాపారాలు ఇప్పటికీ కొద్దిమంది ఆధిపత్య కులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. జనాభాలో తక్కువ శాతం ఉన్నవర్గాలు అధిక వనరులను నియంత్రిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన అసమానత. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది ఆర్థిక శక్తి, రాజకీయ ప్రభావం, సామాజిక ఆధిపత్యానికి మూలం. భూమి కలిగి ఉన్నవారి వివరాలకు వెళ్తే, మొత్తం తెలంగాణ లో 35.6% కుటుంబాలు భూమి కల్గి ఉంటే, షెడ్యూల్డ్ కులాలలో 35.2%, షెడ్యూల్డ్ తెగలలోలో 58.1%, వెనుకబడిన కులాలలో 36.3%, జనరల్ కులాలలో 33.7%, కుటుంబాలు భూమిని కలిగి ఉన్నాయి. ఇందులో 5 ఎకరాలకు లోబడి వెనుకబడిన కులాలలో 85%, షెడ్యూల్డ్ క్యాస్ట్‌లో 90.5%, షెడ్యూల్డ్ తెగలలో 80.1%, జనరల్ క్యాస్ట్‌లో 69.1% ఉన్నారు.

ఐదు నుంచి 20 ఎకరాలలో వెనుకబడిన కులాలలో 12.2% షెడ్యూల్డ్ కులాలలో 7%, షెడ్యూల్డ్ తెగలలో 17.9%, జనరల్ క్యాస్ట్‌లో 26.4% ఉన్నారు. అలాగే 20 ఎకరాలకు పైబడిన భూమి ఉన్నటువంటి వాళ్లు షెడ్యూల్డ్ క్యాస్ట్‌లో 1%, షెడ్యూల్డ్ ట్రైబ్‌లో 2%, బిసిలలో 2.9%, జనరల్ క్యాస్ట్‌లో 4.4% ఉన్నారు. కాని ఈ భూ వివరాలు కూడా వాస్తవికతకు దగ్గరగా లేవు, ఎందుకంటే ఆధిపత్య కులాల చేతిలో భూమి ఇంకా ఎక్కువ శాతం ఉంది. భూభారతి రికార్డులతో పరిశీలించి వివరాలు వెల్లడిస్తే వాస్తవాలు బయట కొస్తాయి. ఇందులో ఇచ్చినటువంటి గణాంకాలు భూ యజమాని ఇచ్చిన సమాచారంపై ఆధారపడి ఉంది. కాబట్టి పూర్తిగా నిజం ఉన్నదని భావించదానికి వీలు లేదు. ప్రభుత్వ రికార్డులతో పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయి. కేవలం 9.2% జనాభా ఉన్న 6 అగ్రకులాలు 18.5% భూమిని నియంత్రిస్తున్నాయి. ఎస్‌సి, బిసి వర్గాల్లో చాలా కులాలు జనాభా శాతంతో పోలిస్తే భూమి తక్కువగా కలిగి ఉన్నాయి భూమి యాజమాన్య విషయంలో స్పష్టమైన సామాజిక -ఆర్థిక అసమానతలు ఉన్నాయి.

అదేకాకుండా ఆధిపత్య కులాల లో 30% మంది భూయాజమానులకు 5 ఎకరాలకు పైబడి భూమిని కలిగి ఉన్నారు. ఇక వ్యాపారాల, పరిశ్రమల, కంపెనీల, రియల్ ఎస్టేట్ పేర లక్షల ఎకరాల వ్యవసాయేతర భూముల్ని అధిపత్య కులాలు కలిగి ఉన్నారు. ఎంఎల్‌ఎలు, ఎంపిలు, కీలక పదవుల్లో ఎవరి ప్రాబల్యం ఎంత? ఉమ్మడి నిజామాబాదు, ఖమ్మం జిల్లాలో బిసిలు మెజారిటీ ప్రజలైనప్పటికీ ఒక్క బిసి ఎంఎల్‌ఎ కూడా లేరు. చట్టసభలలో బిసిల స్థానం ఎంత?(ఎస్‌సి, ఎస్‌టిలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ ఉన్నాయి) ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా రిపోర్టు అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఒక రాజకీయ ఎత్తుగడ, బహుశా ఆధిపత్యకుల రాజకీయ ప్రాబల్యం బహిర్గతమవుతుందని తొక్కిపెట్టారని అనుకోవాల్సి వస్తుంది. పేదరికానికి కులానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని సర్వేలో పాల్గొన్నటువంటి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా బిసిలు జనాభాలో 56.4% అయితే పేదరికంలో 58.4% ఉన్నారు.

అలాగే, ఎస్‌సిలు జనాభాలో 17.5% అయితే, పేదరికంలో 19.7% ఉన్నారు. ఎస్‌టిలు జనాభాలో 10.4% అయితే, పేదరికంలో 13.2% ఉన్నారు. జనరల్ కులాలకు సంబంధించి 15.79% జనాభా ఇందులో కులం చెప్పనివారు 11.96 లక్షలు అనగా 3.4 % ను తీసి వేస్తే ఒసిల జనాభా 12.4%శాతం. అయితే, వారి 100 జనాభాలో 8.5% పేదరికంలో ఉన్నారు. ఒసిలలోని 18 కులాలలో ఒక్క కులం కూడా పేదరికంలో లేదు. అన్ని కూడా CBI (COMPOSITE BACKWARDNESS INDEX) లో అడుగున ఉన్నాయి. సంక్షేమ పథకాలు,- పంపిణి- ఈ రిపోర్ట్ మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సంక్షేమ పథకాలు సమానంగా అందడం లేదు. ‘

రైతుభరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ ఇవి ఎక్కువగా భూమి ఉన్న వర్గాలకే లాభం చేకూర్చాయి. భూమిలేని, అట్టడుగు వర్గాలకు ఒరిగింది శూన్యం. బిసి కులాల్లో తీవ్రమైన అంతర్గత అసమానతలు ఉన్నవి. కొన్ని బిసి కులాలు, ఎస్‌సిల కంటే కూడా వెనుకబాటులో ఉన్నాయి కాబట్టి, లక్ష్యబద్ధమైన విధానాలు అవసరం అని నొక్కి చెప్పుతుంది. ఆధిపత్య కులాల జీవన విధానమే వేరు ఆధిపత్య కులాలు మిగతా బిసి, ఎస్‌సి, ఎస్‌టి కులాల జీవన విధానములో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ కులగణన సర్వే ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఎన్ని ఉద్యమాలు జరిగినా తెలంగాణలో అభివృద్ధి సమానంగా జరగలేదు. సంపద, రాజకీయ అధికారం అంతా కొద్దీ కులాల చేతిలో కేంద్రీకృతమైనది. బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలి పోయారు. కానీ అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. ఈ డేటాను ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుంది? విధాన మార్పులు చేస్తుందా? బహుజనులలో అట్టడుగు కులాలకు ప్రత్యేక ఆర్థిక ప్రణాళికలు ఏమైనా తెస్తుందా? లెక్కలు బయటపడ్డాయి. సరిచేయాల్సిన సమయం వచ్చింది. అధికారం లాక్కుంటేనే అది సాధమవుతుందనే విషయం గుర్తు బెట్టుకోవాలి.

- టి. చిరంజీవులు

విశ్రాంత ఐఎఎస్,

(బిసి మేధావుల ఫోరం చైర్మన్)