
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత ధరలు పెంచుతారన్న ఊహాగానాలను తోసిపుచ్చుతూ, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రణాళికలు తమకు లేవని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది.
ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. "పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదు" అని తెలిపారు. బుధవారం పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత రిటైల్ ఇంధన ధరలు పెంచుతారా అనే ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో భయాందోళనలతో కొనుగోళ్లు జరపడానికి కారణమైన, తక్షణమే ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలను ఆమె తోసిపుచ్చారు.
"కొన్ని చోట్ల భయాందోళనలతో కొనుగోళ్లు జరపడాన్ని మేము చూశాం. ఈ ప్రాంతాలన్నింటిలోనూ మేము రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాము. నిల్వలు అందుబాటులో ఉండేలా, కొరత ఏర్పడకుండా ఉండేందుకు అన్ని రిటైల్ అవుట్‌లెట్లను పర్యవేక్షిస్తున్నాము" అని ఆమె అన్నారు. బుధవారం తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో రాజకీయ ఉద్రిక్తతలతో కూడిన అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ధరలు తక్షణమే పెరుగుతాయన్న ఊహాగానాలతో దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ బంక్ లకు వాహనాదారులు క్యూకట్టారు.












