అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత నాలుగేళ్లుగా ఇంధన రిటైల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, చమురు కంపెనీలకు భారీ నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 126 డాలర్ల వరకు చేరి నాలుగేళ్ల గరిష్ఠ స్థాయిని తాకాయి. అనంతరం కొంత తగ్గినా, ధరలు ఇంకా 110 డాలర్లకు పైగానే కొనసాగుతున్నాయి. హార్మూజ్ జలసంధి మార్గంలో నౌకాయాన రాకపోకలు పరిమితమవడం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పరిశ్రమ తరఫున ప్రకటన విడుదల చేస్తూ, అంతర్జాతీయ ఇంధన వ్యయాలు పెరిగినా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ ఎల్పీజీ ధరలను పెంచడం లేదని తెలిపింది. అయితే వాణిజ్య ఎల్పీజీ, పారిశ్రామిక డీజిల్, 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లు, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు సరఫరా చేసే జెట్ ఇంధన ధరలను మాత్రం పెంచినట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 29తో ముగియడంతో, లీటరుకు రూ.25-28 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు ఇప్పటికే అంచనా వేశారు.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడులు జరపడం, దానికి ప్రతిగా టెహ్రాన్ కఠిన చర్యలు చేపట్టడంతో హార్మూజ్ జలసంధి దాదాపు మూతపడిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు ఈ మార్గం ద్వారానే సాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. గత వారం చమురు మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై సుమారు రూ.20, డీజిల్‌పై దాదాపు రూ.100 నష్టాన్ని భరిస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ వెంటనే ధరలు పెంచే ప్రణాళిక లేదని అప్పట్లో స్పష్టం చేశారు.

గత ఏడాది బ్యారెల్ ముడిచమురు ధర సుమారు 70 డాలర్లుగా ఉండగా, ఈ నెలలో సగటు ధర 114 డాలర్లకు మించి నమోదైంది. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు 2022 ఏప్రిల్ నుంచి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.94.77 కాగా, డీజిల్ ధర రూ.87.67గా ఉంది.