తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతల మధ్య ఆటా పాటలతో గడపాల్సిన ఇద్దరు చిన్నారులు భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో తల్లి వద్దని వెళ్లిపోతే చేరదీయాల్సిన ఆ తండ్రి కూడా వదిలేయడంతో ఆ ఇద్దరు పిల్లలు పోలీస్ స్టేషన్ మెట్లపై బిక్కు బిక్కుమని ఏడ్చేసిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మా పూర్ మండలం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులోని తమిళ కాలనీకి చెందిన దంపతులు లలిత,రవి అనే ఇద్దరు  పదేళ్ల కింద ఒకరి కొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వారికి శృతి,ప్రీతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.గత కొంత కాలంగా రవి-లలిత దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చి వేరుగా ఉంటున్నారు. లలిత హైదరాబాద్ లో నర్సింగ్ కోర్సు చేస్తుండగా,రవి స్థానికంగా బావుపేట వద్ద కిరాణ వ్యాపారం చేసుకుంటున్నాడు.

భార్యాభర్తల మధ్య,విభేదాలు రావడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు పెట్టిన కూడా ఇద్దరి మధ్య సాయోధ్య కుదరక పోవడంతో వీరి పంచాయతీ సోమవారం ఎల్ ఎండీ పోలీసే స్టేషన్ కు వచ్చింది. పోలీసులు దంపతుల మధ్య సయోధ్య కుదుర్చేందుకు కౌన్సిలింగ్ నిర్వ హించి,భార్య భర్తలు కలిపేందుకు ప్రయత్నించారు. పోలీసులు సర్ది చెప్పిన వినకుండా ఆ చిన్నారుల తల్లి తనకు భర్త,పిల్లలు అక్కర్లేదంటూ తాళి, మెట్టలు తీసి టేబుల్ పై పెట్టి, పిల్లలను పోలీస్ స్టేషన్ లోనే వదిలేసి వెళ్లి పోయింది.ఆ తర్వాత భర్త తనకు కూడా పిల్లలు వద్దంటూ వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ మమ్మీ డాడీ అంటూ రోదిస్తూ కనిపించిన దృశ్యం పోలీసులతో పాటు అక్కడున్న వారిని కంట తడి పెట్టించింది. దీంతో  ఎల్ఎండి ఎస్ఐ అన్వర్  ఆ చిన్నారుల నానమ్మ తాతయ్యల వివరాలు తెలుసుకొని వారికి అప్పగించడం జరిగింది.