వరుస విజయాలతో ఐపిఎల్ సీజన్ 2026లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న పంజాబ్ కింగ్స్ జోరుకు బ్రేక్ పడింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన రాజస్థాన్ 19.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు జట్టుకు శుభారంభం అందించారు.

విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సూర్యవంశీ 16 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. ఇక యశస్వి 27 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. చివర్లో డొనొవన్ ఫెరీరా, శుభమ్ దూబెలు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయారు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఫెరీరా 26 బంతుల్లోనే అజేయంగా 52 పరుగులు చేశాడు. శుభం 12 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ను స్టోయినిస్ 22 బంతుల్లో 62 (నాటౌట్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (59) అండగా నిలిచారు.