రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ తాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరడం పూర్తిగా స్వచ్ఛంద నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశం కోసం చేస్తున్న పనుల నుంచే తనకు ప్రేరణ లభించిందని తెలిపారు. 2024లో ఆప్ నాయకత్వంతో తీవ్ర విభేదాలు ఏర్పడిన మాలీవాల్, ఇటీవల బీజేపీలో విలీనమైన ఏడుగురు ఆప్ రాజ్యసభ సభ్యుల బృందంలో భాగమయ్యారు. మంగళవారం ఆమె ఢిల్లీలోని బీజేపీ కార్యాలయాన్ని సందర్శించగా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్‌హోత్రా, ఎంపీ యోగేందర్‌చందోలియా, ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు మిట్టల్ సమక్షంలో ఆమెను అధికారికంగా పార్టీలో చేర్చుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా దేశం కోసం చేస్తున్న చారిత్రాత్మక పనులు నన్ను బాగా ప్రభావితం చేశాయి. వారినుంచి స్ఫూర్తి పొందే నేను బీజేపీలో చేరాను అని స్వాతి మాలీవాల్ మీడియాతో చెప్పారు.ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన సమయంలో కూడా బీజేపీ

నుంచి తనకు మంచి సహకారం లభించిందని మాలీవాల్ తెలిపారు. ఎవరి బలవంతం వల్ల నేను ఈ పార్టీలో చేరలేదు. జరుగుతున్న ప్రతి పనినీ ఆసక్తిగా గమనించాను. దేవుడికి, బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు. ఇకపై ఢిల్లీ కోసం మరింత బలంగా పనిచేస్తాను అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆప్‌పై మాలీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌దాదాపు రెండు పదవీకాలాలపాటు ఢిల్లీని దోచుకున్నారని, రాజధాని మౌలిక సదుపాయాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఆప్ పాలనలో రహదారులు దయనీయంగా మారాయి. తాగునీటి సరఫరా దెబ్బతింది. ప్రజలు కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడ్డారు. గత రెండేళ్లలో రేఖా గుప్తా ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించింది అని మాలీవాల్ అన్నారు. అలాగే ఎక్సైజ్ కేసులో హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంతా శర్మ ఎదుట వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ హాజరుకాకుండా సత్యాగ్రహ మార్గంలో నడుస్తానని కేజ్రీవాల్ ప్రకటించడాన్ని ఆమె డ్రామాగా అభివర్ణించారు.