
గాలి గుసగుస లాడుతూనే వుంది
హృదయం మాత్రం
నిశ్శబ్ద తీరాల కోసం ఆరాటపడుతుంది
ప్రతి శ్వాసలోని
సున్నితమైన తరంగాలు
ఆత్మను గుర్తు చేస్తున్నాయి
ఊపిరి సలపని
పని నుండి కాస్సేపు
నాకు సెలవు కావాలి
ఎండిన ఆకుల చిరచిరలు
గుండెను చికాకు పెడుతున్నా
నా లోపల వసంతం
ఇంకా పచ్చిగానే వుంది
ఇప్పుడు కొంత సమయాన్ని
దొరక బుచ్చుకోవాలి
నిశ్చలంగా, నిశ్చయంగా
నన్ను నేను
పునరుద్ధరించుకునే
క్షణాలు కావాలి
- కుడికాల వంశీధర్












