చిట్యాల మండంలంలోని బొంగోని చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో గల నోష్ ఫార్మా ల్యాబ్‌లో శుక్రవారం రియాక్టర్ పేలింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కార్మికుల దినోత్సవమైన మేడే రోజున ఈ విషాద సంఘటన చోటుచేసుకోవడం కార్మికవర్గాన్ని కలచి వేస్తుంది. కార్మికులు తెలిపి వివరాల ప్రకారం.. ఉదయం 11 గంటలకు పరిశ్రమలో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. చుట్టుపక్కల ప్రజలు ఉలిక్కిపడి తేరుకునేలోపే కంపెనీ నుంచి దట్టమైన పొగలు, మంటలు వచ్చాయి. దీంతో కంపెనీలో ప్రమాదం సంభవించిందని ప్రజలకు అర్థమైంది. కాగా, మూడో బ్లాక్‌లో ఈ ప్రమాదం సంభవించింది. చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామానికి చెందిన బొడ్డు బాలక్రిష్ణ 32 చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది. మృతుడు గత ఐదేళ్ల్లుగా కంపెనీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. అతనికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఆ బ్లాక్‌లో మొత్తం 8 మంది తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ హాస్పిటల్‌కు తరలించారు.