రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమల్లో ఘోర వైపల్యం చెందిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రబీ సీజన్‌లో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని, తాలు, తరుగు, తేమ పేరు చెప్పి దోచుకుంటున్న దళారుల నుండి రైతును ఆదుకుని ప్రతి గింజను ఎమ్మెస్పీ ధరకు కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సైతం రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంవల్ల ఆ పథకం ద్వారా తెలంగాణ రైతులు ప్రయోజనం అందుకోలేకపోతుండటం బాధాకరమని తెలిపారు. ముఖ్యంగా వడ్లు, మొక్కజొన్న, శనగ కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.మండుతున్న ఎండలు, వడగాడ్పులు, అకాల వర్షాలతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అల్లాడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు, మక్కజొన్న,

శనగలు, పొద్దుతిరుగుడుసహా రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి నానా పాట్లు పడుతున్నారని, ఆరుగాలం పండించిన పంటలను వెంటనే అమ్ముకునే దిక్కులేక మండుటెండలో రోజుల తరబడి -ఎదురు చూస్తూ అస్వస్థతకు గురవుతూ ఆసుపత్రుల పాలై చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా కపోవడం అత్యంత బాధాకరమని బండి ధ్వజమెత్తారు. అన్నదాతలు పడుతున్న కష్టాలను చూడలేక అత్యంత బాధాతప్త హ్రుదయంతో కొన్ని విషయాలను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నట్లు బండి పేర్కొన్నారు. గత రబీ సీజన్ కూ బోనస్ ఎగ్గొట్టారు,.ఈ సీజన్‌లోనూ బోనస్‌కు పాతరేసినట్లేనా? అని ప్రశ్నించారు. సన్న వడ్లకే బోనస్ ఇచ్చి దొడ్డు వడ్లు పండించిన రైతులకు మొండి చేయి చూపారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీని తుంగలో తొక్కారు. పత్తి పంటకు ఎమ్మెస్పీ ఎగ్గొట్టి రైతులను ముంచారని విమర్శించారు. మొక్కజొన్నకు కేంద్రం ఎమ్మెస్పీ ఇస్తున్నా కొనుగోలు బాధ్యతను విస్మరించి దళారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.


అకాల వర్ష బాధిత రైతాంగానికి ఏదీ పరిహారం

అకాల వర్షాలతో రెండున్నరేళ్లలో 5 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టపోతే ప్రభుత్వం ఏం చేస్తోందని బండి సంజయ్ ఆ లేఖలో ప్రశ్నించారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.5 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.260 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అని నిలదీశారు. పౌరసరఫరాల సంస్థను అప్పుల ఊబిలోకి నెడతారా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ రూ.56 వేల కోట్ల అప్పులతో దివాళా తీయించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో సంస్థను రూ.లక్ష కోట్ల అప్పుల పాల్జేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ డిక్లరేషన్ ను పాతిపెట్టి, రాయపూర్ ఏఐసీసీ రైతు తీర్మానాలకు తిలోదకాలిచ్చారా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు. రబీ సీజన్‌లో రైతుల వెతలపై మీరు ఏనాడైనా సమీక్షించారా అని నిలదీశారు. వడగాల్పులతో జనం అల్లాడుతుంటే మీ డిజాస్టర్ మంత్రి నిద్రపోతున్నారా?, ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతుంటే సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఏదని కేంద్రమంత్రి అడిగారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే ఆందోళన తప్పదని బండి ఆ లేఖలో హెచ్చరించారు.