అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘రాకా’. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా దీపిక పదుకొనే నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా దీపిక ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో ఆమె పలు డేంజరస్ యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి వస్తుంది. అయితే దీపికా ఇటీవలే మరోసారి గర్భం దాల్చారు. దీంతో ఆమె స్టంట్స్ చేయలేరని.. ఆమె స్థానంలో వేరే హీరోయిన్‌ని తీసుకున్నారని గుసగుసలు వినిపించాయి.

తాజాగా ఈ రూమర్స్‌ని ‘రాకా’ టీమ్ ఖండించింది. సినిమాలో దీపిక పాత్ర నిడివి తగ్గించారనే ప్రచారాన్ని కూడా కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని స్ఫష్టం చేసింది. రూమర్స్ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఇక ఈ సినిమాలో దీపికతో పాటు మరికొందరు హీరోయిన్స్‌ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.