మే 16 నుంచి జూన్ 16 వరకు సుదీర్ఘ వడగాలులు

వెల్లడించిన తెలంగాణ వెదర్ మ్యాన్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అండమాన్, కేరళకు సకాలంలో చేరినా రాష్ట్రానికి మాత్రం ఆలస్యం కానున్నాయని, జూన్ 16 తర్వాతే రాష్ట్రంలోకి రుతుపవనాల ప్రవేశం ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ నెల 16 నుంచి జూన్ 16 వరకు రాష్ట్రంలో సుదీర్ఘకాలం వడగాలులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో రీకర్వింగ్ సైక్లోన్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని, దీని ప్రభావంతో ఈ నెల 16నుంచి జూన్ 16 వరకు రాష్ట్రంలో భయంకరమైన వడగాలులు వస్తాయని హెచ్చరించారు. అయితే వాతావరణ పరిస్థితుల్లో మార్పుల ఆధారంగా స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో వేడి వాతావరణ కొనసాగుతోందని శనివారం తూర్పు తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచాయని వెల్లడించారు. నిజామాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నల్గొండ, నిర్మల్, సిద్దిపేటలో 45.9, ఆదిలాబాద్, పెద్దపల్లిలో 45.8. కామారెడ్డి, ఆసిఫాబాద్‌లో 45.7, జగిత్యాలలో 45.6, సూర్యాపేటలో 45.5, ఖమ్మంలో 45.2, మంచిర్యాలలో 45.1 కరీంనగర్‌లో 44.6 డిగ్రీలు నమోదయినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా విఠల్‌వాడీ, ముషీరాబాద్ జిల్లాల్లో 42.6 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయినట్లు చెప్పారు.

నాలుగు రోజుల పాటు వర్షాలు

తూర్పు తెలంగాణలో వడగాలుకు బ్రేక్ పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాలుగు రోజుల పాటు 12 జిల్లాల్లో తీవ్రమయిన ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే రాబోయే రెండు రోజుల పాటు మాత్రం గరిష్ణ ఉష్ణోగ్రతలలో ఎటువంటి మార్పు ఉండదని, తరువాత నాలుగు రోజుల్లో క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాష్ట్రంలో కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.