
సాగునీటి ప్రాజెక్టులు, రైతుల అంశాలపై చర్చ
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, 100 రోజుల్లో
రిటైర్‌మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్‌పై కీలక నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్: కేబినెట్ భేటీ ఈనెల 04వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, రైతుల అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. దీంతోపాటు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించనున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక అంశాలపై చర్చించి వాటిని కేబినెట్‌లో ఆమోదించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, ఫిట్‌మెంట్, పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లుల గురించి కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. 100 రోజుల్లో రిటైర్‌మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్‌ను అందించే విషయంతో పాటు ఈహెచ్‌ఎస్ కార్డులకు సంబంధించి కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని సమాచారం. జూన్ 2న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను కేబినెట్‌లో చర్చించనున్నారు. దీంతోపాటు త్వరలో అమలు చేయనున్న మరో రెండు కొత్త పథకాల గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. వీటితో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.













