చెన్నై సూపర్‌ కింగ్స్ ప్రాంచైజీ క్యాంపులో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టులో ఓ సభ్యుడికి కోలుకోలేని దుఃఖం వచ్చింది. జట్టు పేసర్ ముకేశ్ చౌదరికి మాతృవియోగం కలిగింది. అతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని సిఎస్‌కె తమ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ముకేశ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. కష్ట సమయంలో ముకేశ్‌తో ఉన్నామని భరోసా ఇచ్చింది. తల్లి అంత్యక్రియల కోసం ముకేశ్ తన స్వస్థలానికి వెళ్లడంతో ఇవాళ ముంబై ఇండియన్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌కి అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే గాయాల కారణంగా బలహీనపడిన సిఎస్‌కె బౌలింగ్ విభాగానికి ఇది మరో భారీ ఎదురుదెబ్బగా మారింది.