
దేశాన్ని, రాష్ట్రాల్ని పాలించే వారిలో అగ్ర కులాలకు చెందినవారే ఎక్కువగా ఉంటారు. జనాభాలో సింగిల్ డిజిట్ శాతం ఉన్న ఉన్నత వర్గీయులు వరుసగా తెలుగువారి ఏలికలుగా ఉంటున్నారు. అధిక సంఖ్యాకులైన దిగువ కులాలవారికి లభించే పదవులు కూడా అలాంటి పాలకుల దయపైనే ఆధారపడి వస్తాయి. ఈ మధ్య కాలంలో బీసీల్లో వచ్చిన సామాజిక చైతన్యం కారణంగా వారిని బుజ్జగించేందుకు పదవుల్లో కొంత ప్రాధాన్యత కనబరుస్తున్నారు. మంత్రివర్గంలో మాకెన్ని దక్కాయి అనే నిశిత చూపు కూడా బీసీల్లో పెరిగింది. మూడు, నాలుగు పదవుల నియమాకం జరిగితే అందులో ఒక్కటైనా బీసీకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. లేదంటే బీసీలకు అన్యాయం అంటూ మీడియాలో విమర్శల వెల్లువ మొదలౌతుంది. మునపటి కన్నా బీసీ నేతల వార్తల కవరేజికి పత్రికలు ఎక్కువ చోటును ఇస్తున్నాయి. ఆ నాయకుల వెనుక పెద్ద సంఖ్యలో బీసీ విద్యార్థులు, యువత ఉన్నారన్న ముందు జాగ్రత్తలు మీడియా తీసుకుంటోంది. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టిన రాష్ట్ర జనాభా ఆర్థిక , సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణాంకాల నివేదిక 2024 ద్వారా తెలంగాణ జన జీవన ముఖచిత్రం వెలుగులోకి వచ్చింది.
అందులో ఉన్న కులాలవారీగా జనాభా సంఖ్య ఎన్నో కొత్త విషయాలను బయట పెట్టింది. ప్రత్యేకంగా బీసీ కులాలు, వారి జనాభాతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు క్షుణ్ణంగా తెలియవచ్చాయి. బీసీల మధ్య అంతర్గతంగా ఉన్న హెచ్చు తగ్గులు లెక్కలు కూడా బయటపడ్డాయి. బీసీలందరం ఒకటే అనే భావనతో వెళుతున్న వారిలో ఏ కులాలు ముందున్నాయి, ఏవి వెనుకున్నాయి అనే విషయాన్ని ఈ కొత్త గణాంక వివరాలు స్పష్టం చేశాయి. బీసీల పేరిట లభిస్తున్న రాజకీయ అవకాశాలు, పదవులు కేవలం కొన్ని బీసీ కులాల దగ్గరే ఆగిపోతున్నాయనే విషయం ఈ నివేదిక ద్వారా తేలిపోయింది. దీని ప్రకారం బీసీల్లో ఏ కులం జనాభా ఎక్కువ ఉందో వారికి మాత్రమే బీసీ కోటా దాదాపు పూర్తిగా దక్కుతోంది. బీసీల్లో జనాభాపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న నాలుగైదు కులాలు బీసీ రాజకీయ అవకాశాలను వశపరచుకుంటున్నాయి. బీసీ కేటగిరీల్లో డి,బిలకు చెందినవారే బీసీ కోటాలో పార్టీ టికెట్లు పొంది చట్టసభల్లో అడుగుపెడుతున్నారు.
దాదాపు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నుండి అదే తంతు సాగుతోంది. నియోజకవర్గాల్లో ఏదైనా బీసీ కులం జనాభా 20% పైగా ఉంటే అదే కులానికి చెందిన స్థితిమంతుణ్ణి పార్టీలు తమ బీసీ అభ్యర్థిగా ఎంచుకుంటున్నాయి. మిగతా కులాల బీసీలు అదే బీసీని బలపరచడం వల్ల గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. ఇలా ప్రతిసారి వెనుక ఉండి బలపరచి కులాలు బలపరుస్తూనే ఉంటాయి తప్ప చట్టసభల్లో అవి అడుగు పెట్టడం లేదు. కొన్ని బిసి కులాల జన సంఖ్య ఎక్కువగా ఉన్నా పార్టీ టికెట్ కేటాయించదు. కారణం వారు ఎన్నికల ఖర్చును తట్టుకొనే స్థాయిలో లేకపోవడమే. అలాంటి చోట పార్టీలు అగ్ర కులాల వారి వైపు మొగ్గు చూపుతాయి. జనాభాపరంగా ముందు ఉండి, ఆర్థికంగా లేని కులం వారికి టికెట్ ఇవ్వండి, మేం ఒక్కటై గెలిపించుకుంటాం అని మిగతా బీసీలు ముందుకు రారు. కారణం బీసీల్లో ఉన్న అంతర్గత వైవిధ్యాలు అని చెప్పాలి. పేరుకు బీసీలే కానీ ఏ - కేటగిరిలో ఉన్నవారు పట్ల డి - కేటగిరిలో ఉన్నవారికి చిన్నచూపు. స్పష్టంగా చెప్పాలంటే బీసీ - ఏ కులాలను బీసీ - బి, డి కులాలు దూరంగా ఉంచుతాయి.
బీసీలే అయిన చాకలి, మంగలి పనివాళ్లను పై బీసీ కులాలు తమతో సమానంగా చూడవు. మంగళిని తాకితే స్నానం చేసే బీసీ కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. తెలంగాణ సమగ్ర కుల గణన 2024 రిపోర్ట్ ప్రకారం 133 బిసి కులాల్లో 69 కులాలు పూర్తిగా వెనుకబడినవి కాగా మిగతా 64 సాధారణ వెనుకబాటులో ఉన్నాయి. జనాభా పరంగా చూస్తే పది వేలు కూడా లేని కులాలు 54 ఉన్నాయి, లక్ష లోపు జనాభా ఉన్న కులాలు 43 ఉన్నాయి, లక్ష పైన జనసంఖ్య ఉన్న కులాలు 22 ఉన్నాయి. లక్ష పైనున్న కులాల్లో పది లక్షలు, ఆపై జనం ఉన్నవి వరుసగా ముదిరాజ్, యాదవ, గౌడ్, కాపు, పద్మశాలి కులాలు వస్తాయి. చాకలి కులస్తులు పదిలక్షల దరిదాపున ఉన్నారు. బీసీల్లో రాజకీయంగా ఎదిగిన, అవకాశాలను అందిపుచ్చుకున్నవారు పది లక్షలపై జనాభా ఉన్నవారే మొత్తంగా ఉన్నారు. చాకలి నుండి ఒకరు ఎమ్మెల్యే కాగలిగారు. ఏ పార్టీలో చూసినా పైన పేర్కొన్న ఐదు కులాల నుంచే బీసీ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
జనాభా పరంగానే కాకుండా బీసీల్లో ఆర్థికంగా బలమైన కులాలు కూడా అవే కావడం వల్ల పార్టీలు వారినే వెదుక్కుంటున్నాయి. ఈ ఐదు కులాలు కాకుండా మిగతా వందకు పైగా ఉన్న బిసి కులాలకు రాజకీయంగా పదవులు దక్కే అవకాశాలు లేవనే చెప్పాలి. జన, ధన బలం లేని బీసీలు కేవలం ఆ ఐదు కులాల అభ్యర్థులను గెలిపించే వ్యక్తులుగానే మిగిలిపోతున్నారు. వారికి కూడా రాజకీయ అవకాశాలు దక్కాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేకపోయినా బాగా వెనుకబడిన బీసీలకు గ్రామాల్లో, పట్టణాల్లో వార్డు మెంబర్లుగా ప్రాధాన్యతనియ్యాలి. మిగతా క్రీమీ లేయర్ బీసీలు వారిని కలుపుకొని మద్దతుగా నిలవాలి. వారిని గెలిపించేందుకు కృషి చేయాలి. ఆ ప్రయత్నం మాత్రం పార్టీల నుండి గాని, స్థానిక బీసీ నేతల వైపున గాని జరగడం లేదు. ఎవరైనా కింది బీసీలు ముందుకొస్తే మేమున్నాం కదా మీరెందుకు, ఓడిపోతావేమో అని వారిని పై బీసీలు నిరుత్సాహపరుస్తున్నారు. జనాభా తక్కువ ఉన్న బీసీ కులాల్లో సమర్థులున్నా వారిని జన, ధన తరాజులోనే పార్టీలు తూకం వేస్తున్నాయి. ’మేమెంతో మాకంత’ అన్న నినాదం అన్ని కులాలకు వర్తించాలి కదా!
- బద్రి నర్సన్














