కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మునుపటి కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశ టెక్ మార్కెట్లో అనేక ప్రధాన స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ జనాదరణ పొందిన మోడళ్ల ధరలను పెంచాయి. వీటిలో వన్‌ప్లస్, రియల్‌మీ, రెడ్‌మీ, నథింగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఉండటం విశేషం. ఈ ధరల పెరుగుదలకు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసులో అంతరాయాలు, మెమరీ చిప్‌ల కొరత కారణమని సమాచారం.

స్మార్ట్‌ఫోన్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

ప్రపంచ మార్కెట్ ప్రస్తుతం డీఆర్ఏఎం (DRAM), నాండ్ (NAND) స్టోరేజ్ వంటి కీలకమైన భాగాల తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వేగంగా పెరుగుతున్నందున, ప్రధాన టెక్ కంపెనీలు డేటా సెంటర్ల కోసం పెద్ద మొత్తంలో ర్యామ్ (RAM), జీపీయూలను (GPUs) కొనుగోలు చేస్తున్నాయి. ఇది మెమరీ తయారీదారులను అధిక బ్యాండ్‌విడ్త్ మెమరీ ఉత్పత్తిపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేసింది. ఫలితంగా, స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అవసరమైన భాగాలు మరింత ఖరీదైనవిగా మారాయి. తయారీ ఖర్చులు పెరిగినప్పుడు, అవి నేరుగా తుది ధరపై ప్రభావం చూపుతాయి. అందుకే స్మార్ట్‌ఫోన్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏ కంపెనీ తయారీదారులు, ఏ మోడల్ పై ఎంత పెంచారో ఇప్పుడు తెలుసుకుందాం.

వన్‌ప్లస్, నథింగ్‌

వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల ధరలను గణనీయంగా పెంచింది. వన్‌ప్లస్ 15 ప్రారంభ ధర గతంలో ఉన్న రూ.72,999తో పోలిస్తే, ఇప్పుడు దాని ప్రారంభ ధర రూ.77,999గా ఉంది. ఇక టాప్ వేరియంట్ ధర రూ.85,999కి చేరింది. వన్‌ప్లస్ 15R ప్రారంభ ధర ఇప్పుడు రూ.52,999గా ఉంది. మరోవైపు, నథింగ్ కూడా తన పోర్ట్‌ఫోలియోను సవరించింది. నథింగ్ ఫోన్ 4A ప్రో ప్రారంభ ధర ఇప్పుడు రూ.44,999. నథింగ్ ఫోన్ 4A ప్రారంభ ధర రూ.34,999. నథింగ్ ఫోన్ 3A లైట్ ప్రారంభ ధర రూ.27,999గా ఉంది. ముఖ్యంగా, 3A లైట్ ధర పెరగడం ఇది రెండోసారి.

రియల్‌మీ

రియల్‌మీ తన అనేక స్మార్ట్‌ఫోన్‌ల ధరలను సవరించింది. రియల్‌మీ 16 ప్రో ప్లస్ ఇప్పుడు దాని మునుపటి ధర అయిన రూ.39,999 నుండి రూ.44,999కి పెరిగింది. అదేవిధంగా, రియల్‌మీ 16 ప్రో ప్రారంభ ధర రూ.31,999 నుండి రూ.36,999కి పెరిగింది. అలాగే రియల్‌మీ 15T, రియల్‌మీ 15X, రియల్‌మీ C71, రియల్‌మీ C85 వంటి మోడళ్లు కూడా మరింత ఖరీదైనవిగా మారాయి.

రెడ్‌మీ

షియోమీ సబ్-బ్రాండ్ అయిన రెడ్‌మీ కూడా తన ప్రముఖ నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను పెంచింది. రెడ్‌మీ నోట్ 15 ప్రో ప్లస్ ఇప్పుడు రూ.37,999 నుండి రూ.39,999కి పెరిగింది. రెడ్‌మి నోట్ 15 ప్రో ప్రారంభ ధరను రూ.29,999 నుండి రూ.31,999కి పెరిగింది. ఇంతకుముందు, దీని బేస్ వేరియంట్ రూ.29,999కి అందుబాటులో ఉండేది.