
నేడు రాజస్థాన్‌తో పోరు
జైపూర్: హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. రాజస్థాన్ కూడా మెరుగైన ఆటతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో రాజస్థాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచి ఓటమికి బదులు తీర్చుకోవాలనే లక్షంతో కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్‌లతో హైదరాబాద్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ తదితరులతో రాజస్థాన్ బ్యాటింగ్ కూడా పటిష్టంగా ఉన్న విషయం విదితమే. అయితే వైభవ్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో దాంట్లో తేలిపోతున్నాడు.
ఇది జట్టును కలవరానికి గురి చేస్తోంది. కానీ కీలకమైన హైదరాబాద్ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. యశస్వి కూడా ఇదే లక్షంతో ఉన్నాడు. రవీంద్ర జడేజా ఫామ్‌లోకి రావడం జట్టుకు అతి పెద్ద ఊరటగా మారింది. కానీ ధ్రువ్ జురెల్, కెప్టెన్ పరాగ్‌లు ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నారు. హెట్‌మెయిర్ బ్యాటింగ్‌లో కూడా మెరుపులు కనిపించడం లేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం కీలక ఆటగాళ్లందరూ మెరుగైన ఆటను కనబరిచేందుకు సిద్ధమయ్యారు. ఇక హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందిస్తున్నారు. కిందటి మ్యాచ్‌లో అభిషేక్ కళ్లు చెదిరే శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. క్లాసెన్, ఇషాన్, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులతో హైదరాబాద్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక మలింగ, సకిబ్, ఉనద్కట్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.











