
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు మొక్కజొన్న రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. సేద్యపు ఖర్చులు పెరగడం, పండించిన పంటకు న్యాయమైన ధర లభించక మద్దతు ధర అలంకారప్రాయంగా మారడం, దళారుల దోపిడీకి గురై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రపంచంలో మొక్కజొన్నను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు అమెరికా, మెక్సికో, బ్రెజిల్, చైనాలు. అమెరికా 9 కోట్ల, 60 లక్షల ఎకరాల సాగుద్వారా 360 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి చేస్తూ మొదటి స్థానంలో ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో మొక్కజొన్న ఉత్పత్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. ప్రపంచ ఎగుమతుల్లో అమెరికా వాటానే 50%గా ఉంది. అమెరికా పాలకులు 1930 నుంచి మొక్కజొన్న ఉత్పత్తికి మద్దతు ఇస్తున్నారు. గత 20 సంవత్సరాల్లో సబ్సిడీ సగటు వార్షిక వ్యయం 47 లక్షల డాలర్లు.
ప్రతి సంవత్సరం అమెరికా రైతు 61వేల డాలర్ల సబ్సిడీ పొందుతున్నాడు. భారత రైతులకు కేవలం 282 డాలర్లు మాత్రమే సబ్సిడీ లభిస్తున్నది. అమెరికాలో మొక్కజొన్న దిగుబడి హెక్టార్‌కు 11 టన్నులు కాగా, భారత్‌లో 2 టన్నుల 540 కిలోలు మాత్రమే. నేడు భారతదేశంలో 9.89 మిలియన్ల హెక్టార్ల మొక్కజొన్న సాగు ద్వారా ప్రపంచ విస్తీర్ణంలో 4వ స్థానంలో ఉంది. ఉత్పత్తి 42.3 మిలియన్ టన్నులు. సగటు దిగుబడి ఎకరాకు 20 క్వింటాళ్లు. దిగుబడుల్లో చాలా వెనుకబడి ఉంది. అందుకు కారణం దేశ వాతావరణానికి అనుకూలమైన నాణ్యమైన విత్తనాలు దేశ రైతులకు అందకపోవడమే.
ఆంధ్రప్రదేశ్‌లో 2025- 26 సంవత్సరం రబీ సీజన్‌లో 4.83లక్షల ఎకరాల్లో, తెలంగాణ లో 11 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. దేశంలో మొక్కజొన్న సాగులో తెలంగాణ 5వ, ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉన్నాయి. ఎపి ఎకరా సేద్యపు ఖర్చు రూ. 35 నుండి రూ. 40 వేలు. కౌలు ఖర్చు మరో రూ. 15 వేలు. సగటు దిగుబడి ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్లు. తెలంగాణలో ఎకరా సేద్యపు ఖర్చు రూ. 35 నుండి రూ. 38 వేలు. కౌలు ఖర్చు మరో రూ. 12 వేలు. సగటు దిగుబడి 25 క్వింటాళ్లు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 2,400 రూపాయలు.
కేంద్ర ప్రభుత్వ క్వింటా సాగు ఖర్చు 1,447 రూపాయలుగా నిర్ణయించి మద్దతు ధరను 2400గా ప్రకటించింది. వాస్తవ క్వింటాళ్ సేద్యపు ఖర్చు 2000 నుంచి 2,200 రూపాయలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. దాని ప్రకారం 50% పెంచితే 3,100 గా మద్దతు ధర ప్రకటించాలి. ఎపి, తెలంగాణ రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ కొనుగోళ్ల కేంద్రాలు లేకపోవడం వల్ల ప్రైవేట్ మార్కెట్లో లభిస్తున్న ధర రూ. 1600 నుంచి 1750 రూపాయలు మాత్రమే. ఫలితంగా రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టపోతున్నాడు. రైతాంగం గిట్టుబాటు ధర లభించక నష్టపోయి అప్పుల పాలవుతుంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.
దేశ రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నను కొనుగోళ్లు చేయకుండా 5 లక్షల టన్నుల మొక్కజొన్నను మోడీ ప్రభుత్వం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటూ భారత రైతాంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. అమెరికా మొక్కజొన్నను భారత్ దిగుమతి చేసుకోవాలని మోడీని ట్రంప్ బెదిరించడం, ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన చర్చల్లో మా మొక్కజొన్న కొనరా అని అమెరికా వాణిజ్య మంత్రి హౌ వార్ట్ లుట్నిక్ భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అందుకు తలొగ్గిన మోడీ ప్రభుత్వం మొక్కజొన్న దిగుమతిపై 15% గా ఉన్న సుంకాన్ని పూర్తిగా తొలగిండం భారత ప్రభుత్వంపై అమెరికా ఆధిపత్యానికి నిదర్శనం. త్వరలోనే భారత అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతాయని, ఒప్పందం కుదురుతుందని వార్తలు వస్తున్నాయి. ఒప్పందం జరిగితే భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి పంటల కొనుగోళ్ల బాధ్యత ఉంది. గిట్టుబాటు ధర పంటలకు లభించనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలి. అందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. దాని ద్వారా పంటలు కొనుగోళ్లు చేయాలి. అలాంటి చర్యలు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టలేదు.
వైసిపి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి రూ. 3 వేల కోట్లు కేటాయిస్తే, కూటమి ప్రభుత్వం రూ. 300 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తంతో పంటల కొనుగోళ్ల ఎలా సాధ్యం. తాజాగా ఎపి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మొక్కజొన్నలను కొనలేమని చేతులు ఎత్తారు. కూటమి ప్రభుత్వ మొక్కజొన్న రైతులనే కాదు, ఏ పంట రైతులను ఆదుకోవటం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా మొక్కజొన్న కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. ఫలితంగా రెండు రాష్ట్రాల రైతులకు కనీసం గిట్టుబాటు ధర లభించక నష్టపోయి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిరసిస్తూ, మద్దతు ధర చెల్లించి ప్రభుత్వ సంస్థలే రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నను కొనుగోళ్లు చేయాలని, దళారుల, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీని అరికట్టాలని, మొక్కజొన్న దిగుమతులను ఆపాలని ఉద్యమించడమే మొక్కజొన్న రైతుల నేటి తక్షణ కర్తవ్యం.
బొల్లిముంత సాంబశివరావు
98859 83526












