
న్యూఢిల్లీ ః ఏదేనీ కేసులో నిందితుడికి కోర్టులు యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించవచ్చు. అయితే ఆ వ్యక్తి సరెండర్ కావాలని ఆదేశించే అధికారం ట్రయల్ కోర్టుకు లేదు. ఈ నిర్థిష్ట ఆదేశాలను సుప్రీంకోర్టు వెలువరించింది. ఫోర్జరీ, చీటింగ్ కేసులో నిందితుడు అయిన ఓ వ్యక్తి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ఈ రూలింగ్ ఇచ్చింది.
పిటిషనర్ సరెండర్ కావాలని ఆదేశించే అధికారం దిగువ కోర్టులకు ఉండదని స్పష్టం చేశారు. సరెండర్ అధికారం ట్రయల్ కోర్టుల పరిధిలోకి వచ్చే అంశం కాదని తెలిపారు. ఈ కేసులో ఈ నిందితుడు తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దశలో హైకోర్టు ఆయన మందస్తు బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. ఇదే దశలో వెంటనే సరెండర్ కావాలని, తరువాత రెగ్యులర్ బెయిల్‌కు అప్పీలు చేసుకోవాలని ఆదేశించింది. ఈ చర్యను సుప్రీంకోర్టు తప్పుపట్టింది.















