తెలంగాణ అస్తిత్వాన్ని గాలికొదిలేసినోళ్లా

ఒరిజినల్ గురించి మాట్లాడేది

బిఆర్‌ఎస్ నాయకులకు తెలంగాణ రాష్ట్ర సేనా నేతల కౌంటర్ 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్‌ఎస్) ఏర్పాటుతో బిఆర్‌ఎస్ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిందని ఆ పార్టీ నాయకులు అన్నారు. కవిత ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్‌తో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎల్. రూప్ సింగ్, రంగు నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్, గొంగళ్ల రంజిత్ కుమార్, మంచాల వరలక్ష్మీ, నరేశ్ ప్రజాపతి మీడియాతో మాట్లాడారు.

టిఆర్‌ఎస్ పేరుతో కవిత పార్టీ పేరు ప్రకటించగానే బిఆర్‌ఎస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒరిజినల్, డూప్లికేట్ అంటూ చేసిన పోస్టులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌కు నిజమైన హక్కుదారు కవితక్కనే అని రంగు నవీన్ ఆచారి అన్నారు. బిఆర్‌ఎస్ వదిలేసిన తెలంగాణవాదాన్ని కవిత భుజాన ఎత్తుకున్నారని గుర్తు చేశారు. అధికారం వచ్చిన వెంటనే తెలంగాణవాదాన్ని, ఉద్యమకారులను వదిలేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌ది కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణవాదులను లాఠీలతో కొట్టించిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన వారు తెలంగాణ వాదం గురించి మాట్లాడతారా...? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాలు, తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ విగ్రహం పెట్టేందుకు ఏమీ ఇబ్బంది వచ్చిందని బిఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణవాదాన్ని చంపేసిన మీరా ఒరిజినల్ అని మాట్లాడేది అంటూ బిఆర్‌ఎస్ నేతలను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. తెలంగాణవాదులు, అస్తిత్వాన్ని అవమానించినందుకు బిఆర్‌ఎస్ నేతలు సిగ్గుపడాలని అన్నారు. తెలంగాణవాదం లేదని చెప్పిన జీవన్ రెడ్డిని పార్టీలోకి తెచ్చుకొని ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. తమది నక్సలైట్ల ఆర్థిక విధానానికి దగ్గరి విధానం అని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత నవ యువకులు శృతి, సాగర్‌లను నక్సలైట్ల పేరుతో చంపింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.

సిద్ధాంతం వేరైతే మన పిల్లలు అని కూడా చూడకుండా చంపేస్తారా..? అని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉండి ట్యాంక్ బండ్‌పై తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయారని మండిపడ్డారు. స్థలం కేటాయిస్తే జాగృతి నుంచి తామే విగ్రహం ఏర్పాటు చేయిస్తామని ప్రతిపాదనలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. అధికారికంగా ఒక్క తెలంగాణతల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేని వాళ్లు ఒరిజినల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, అమరుల ఆశయాలను కాపాడే గొప్ప అడ్మినిస్ట్రేషన్‌ను కవిత ప్రజల ముందుకు తీసుకువస్తారని తెలిపారు.