మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్)లో చేరనున్నారు. తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శుక్రవారం టిఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టిఆర్‌ఎస్‌లో చేరుతానని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టిఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోడ జనార్దన్ ప్రస్తుత మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచారు. ఎన్‌టి రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు.


పార్టీ, కార్మిక జెండాలు ఎగురవేసిన కవిత

ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే వేడుకలను శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రాష్ట్ర సేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మే డే జెండాతో పాటు కార్మిక జెండాను ఆవిష్కరించారు. కార్మికులు, కర్షకులకు మే డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక అమరవీరులకు నివాళులు అర్పించారు. మే డే వేడుకల్లో ఆటో యూనియన్ నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు.