మే నెల 4వ తేదీ టిఎంసి కాలం చెల్లే తేదీ (ఎక్ప్‌పైరీ డేట్) అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చిచెప్పారు. బెంగాల్‌లో గురువారం ముగిసిన మొదటి రౌండ్ భారీ పోలింగ్ బెంగాల్‌లో అధికార మార్పిడికి సంకేతాలు ఇస్తోందని మోడీ స్పష్టం చేశారు. మే 4తో ఎన్నికలు అయిపోతాయి. ఓట్ల లెక్కింపుతో టిఎంసి సాగించిన 15 సంవత్సరాల సిండికేట్ వ్యవస్థ, చలాయించిన మహా జంగిల్ రాజ్ కథ ముగుస్తుందని ప్రధాని తెలిపారు. గురువారం ఆయన సౌత్ పరగణా జిల్లాలోని కక్‌ద్వీప్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ప్రాంతం రెండో దఫా పోలింగ్ జరిగే కీలకమైన మథురాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. టిఎంసి సాగించిన భయోత్పాతాల పాలన ఖచ్చితంగా మట్టికరుస్తుంది. ఇకపై బిజెపి వాగ్దానం చేసిన భరోసా హామీతో టిఎంసి చిత్తు కానుందని స్పష్టం చేశారు. ఇప్పుడు జనం పెద్ద ఎత్తున అవినీతి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓటేశారని , త్వరలోనే ఈ విషయం నిర్థారితం అవుతుందని తెలిపారు.

ఇన్ని సంవత్సరాల బెంగాల్ పాలనలో టిఎంసి అవినీతి బారిన పడని ఏ ఒక్క రంగం లేదని చురకలు పెట్టారు. అంతటా టిఎంసి సిండికేట్లు , దళారులు దోచుకుతినని రోజు లేదన్నారు. మమత బెనర్జీ పాలనలో తప్పుడు వాగ్దానాలు సాగాయి. ప్రజలను నిండా మోసం చేశారని అంటూ ప్రధాని మోడీ ఈ సందర్భంగా టిఎంసి హయాంలో అమలుకాని వాగ్దానాల జాబితాను చదివి విన్పించారు. గంగాసాగర్ మేళాకు అనుసంధానం చేసే వంతెన నిర్మాణ పనులు ఇప్పటికీ చేపట్టలేదు. దీనితో ప్రధాన ప్రాంతాలకు , సాగర్ ఐలాండ్‌కు మధ్య అనుసంధాన ప్రక్రియ దెబ్బతిందని ప్రధాని తెలిపారు. వరదల నివారణ చర్యల కట్టడాలను పట్టించుకోలేదు. టిఎంసి ఎప్పుడూ కేంద్ర ప్రాజెక్టుల అమలును అడ్డుకుంటూ వచ్చింది. తాను ఏ పనిచేయలేదు. ఇతరులను పనులు చేయకుండా అడ్డగించిందని విమర్శించారు. పైగా కేంద్రం నుంచి అందే అభివృద్థి పనుల నిధులను దారిమళ్లించడం పనిగా పెట్టుకుందని విమర్శించారు.

ఇక ఇటీవలే టిఎంసి కాంగ్రెస్‌తో చేతులు కలిపి చట్టసభలలో మహిళలకు 33 శాతం సీట్ల కోటాను అడ్డుకుందని ఆరోపించారు. మహిళా నాయకురాలు చేయాల్సిన పని ఇదేనా అని ప్రశ్నించారు. దేశంలోని పలు వనరులను తినేస్తున్న అక్రమవలసదార్ల నిరోధం విషయంలో తమ ప్రభుత్వం రాజీ లేని ధోరణికి దిగుతుందని ప్రధాని తెలిపారు. అక్రమవలసదార్లతో దేశ భద్రత ముప్పులో పడుతుందని హెచ్చరించారు. ఇతర దేశాల నుంచి కొందరు సముద్ర మార్గాల మీదుగా ఇక్కడికి చేరుతున్నారు. వీరికి టిఎంసి పాలకులు తమ రాజకీయ ఓటు బ్యాంకు ప్రాబల్యం కోసం ఆశ్రయం కల్పిస్తోంది. దీనితో వారు రెచ్చిపోయి, అధికార దర్పం బలంతో ఏదైనా చేసే స్థితికి చేరుతున్నారని ప్రధాని విమర్శించారు.