తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టిజి జెన్కో) తన నాణ్యత, సామర్థ్యం, నిరంతర మెరుగుదల పట్ల చూపుతున్న కట్టుబాటుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. జెన్‌కో సంస్థ ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌ఓ 9001:2015 (క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్) సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ సర్టిఫికేషన్‌ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ అందుకున్నారు. ఒక స్వతంత్ర ఐఎస్‌ఓ ధృవీకరణ సంస్థ నిర్వహించిన సమగ్ర ఆడిట్ అనంతరం ఈ గౌరవం దక్కింది. ఈ తనిఖీల్లో భాగంగా ఆడిట్ బృందం టీజీ జెన్కోలోని అన్ని విభాగాలు, కార్యకలాప విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రధానంగా ఐఎస్‌ఓ పత్రాల అనుసరణ, విభాగాల వారీ పనితీరు, కార్యకలాపాల ప్రభావితం, సంస్థ లక్ష్యాల సాధన,

నాణ్యత నిర్వహణ వ్యవస్థల అమలును బృందం లోతుగా మూల్యాంకనం చేసింది. ప్రతి విభాగం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్తమ పద్ధతులను పాటిస్తోందని నిర్ధారించిన అనంతరం ఈ సర్టిఫికేషన్ మంజూరుకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీజీ జెన్కో యొక్క ఉన్నత నాణ్యత సేవలకు, బలమైన నిర్వహణ వ్యవస్థలకు ఈ గుర్తింపు ఒక నిదర్శనమని కొనియాడారు. ఈ అంతర్జాతీయ ధృవీకరణ సంస్థ కార్యకలాపాల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడమే కాకుండా, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా బాధ్యతను పెంచుతుందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐ ఎస్‌ఓ ప్రతినిధి శివయ్యలు పాల్గొన్నారు.