హైదరాబాద్: తెలంగాణ పైన మళ్ళీ కుట్రలు ప్రారంభమయ్యాయని, అన్ని తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేత పిల్లుట్ల రఘు, హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో కలిసి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుటిల ప్రయత్నాలు, తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేసినా ప్రజలు రానున్న శాసనసభ ఎన్నికల్లో కెసిఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీలు మారిన తర్వాత ఏ నాయకుడికి ఉనికి ఉండదని చెప్పారు. హుజూర్‌నగర్‌లో పార్టీ మారిన ఎంఎల్‌ఎ కనీసం తన సొంత గ్రామంలో సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేని పరిస్థితికి దిగజారిపోయారని పేర్కొన్నారు. హుజూర్‌నగర్ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి గులాబీ పార్టీలో చేరిన పిల్లుట్ల రఘుకి కెటిఆర్ అభినందనలు తెలిపారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల కంటే పంచాయతీ ఎన్నికల తర్వాత దాదాపు 14,000 అదనపు ఓట్ల మెజారిటీ బిఆర్‌ఎస్ పార్టీకి లభించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక ఎంఎల్‌ఎ పార్టీని వదిలిపెట్టి పోయినా ప్రజలు మాత్రం బిఆర్‌ఎస్ వెంటే ఉన్నారని అనడానికి ఇదే నిదర్శనం అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.