హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి నుంచి వర్చువల్‌గా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్‌లోని పిఎం మిత్ర పార్కును ప్రారంభించారు. జహీరాబాద్‌లో పారిశ్రామిక ప్రాంతానికి, నాలుగు వరుసల రోడ్డు పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. గుడెబెల్లూర్-మహబూబ్‌నగర్ మధ్య 165 కి.మి. మేర హైవేకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్‌ను ప్రధాని జాతికి అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయని తెలిపారు. సైబరాబాద్.. అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారిందని సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఇవి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. వరంగల్ పిఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. దేశ టెక్స్‌టైల్ రంగంలో వరంగల్ పిఎం మిత్ర పార్కు కీలక పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పిఎం మిత్ర పార్క్‌తో ఉద్యోగావకాశాలు భారీగా వస్తాయని తెలిపారు.

హైవేలపై కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని మోడీ తెలిపారు. ‘‘హైవేల అభివృద్ధి ద్వారా తెలంగాణ కూడా లాభపడుతోంది. గతంలో ఉమ్మడి ఎపికి రైల్వే బడ్జెట్‌లో 1000 కోట్లు కూడా దక్కేవి కావు. ఇప్పుడు తెలంగాణకే రూ.ఐదున్నర వేల కోట్లు కేటాయించాం. సిఎం రేవంత్ రెడ్డి గారూ.. ఇది వింటున్నారా..? తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుంది. తెలంగాణ వికసిస్తే.. దేశం కూడా వికసిస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.