
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొంది ఇప్పటికే పుష్కర కాలం గడిచింది. ఈ 12 ఏండ్లలో బిల్లుకు రెండుసార్లు సవరణలు జరిగినాయి. ఈ రెండు సందర్భాలలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను తీర్చడానికి తప్ప తెలంగాణకు ప్రయోజనం చేకూర్చే ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ సవరణల్లో చోటు చేసుకోలేదు. మొదటి సవరణ మే 2014 జరిగింది. అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏర్పడనే లేదు. ఎన్నికలు జరిగి తెలంగాణలో కొత్త ప్రభుత్వం జూన్ 2న ప్రమాణ స్వీకారం చేయవలసి ఉన్న సందర్భంగా ఈ సవరణ బిల్లు ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ సవరణలో చేసింది ఏమిటో అందరికీ తెలిసిందే. ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు మండలాలను (చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, నెల్లిపాక, భద్రాచలం పట్టణం మినహాయించి భద్రాచలం, బూర్గుంపాడు, కుకునూరు, వేలేరుపాడు) తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరపకుండానే చంద్రబాబు నాయుడు ఒత్తిడికి తలొగ్గి మోడీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఇవన్నీ పోలవరం ప్రాజెక్టు ముంపులోకి వచ్చే ప్రాంతాలు కావడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే వీటిని లాగేసుకోవాలన్న కుట్ర ఇందులో దాగి ఉంది. అప్పుడు తెలంగాణ సమాజం తీవ్రంగా స్పందించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరిగింది. అయినా కూడా మోడీ ప్రభుత్వం ఎపి ప్రభుత్వానికి అనుకూలంగా తర్వాతి కాలంలో పార్లమెంట్‌లో సవరణ బిల్లు పెట్టి ఆమోదించింది. అట్లా ఖమ్మం జిల్లాలో ఉన్న 7మండలాలే కాదు 350 మెగావాట్ల లోయర్ సీలేరు జలవిద్యుత్ ప్రాజెక్టు కూడా తెలంగాణ చేజారిపోయింది. ఏప్రిల్ 2026 లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ప్రతిపాదిస్తూ రెండవ సవరణను ఆమోదించింది. ఈ సందర్భంగా భద్రాచలం పట్టణం చుట్టూ రామాలయ భూములు భూములు ఉన్న 5 గ్రామాలను (ఏటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు) తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్ ఎన్నో ఏండ్లుగా ఉన్నది. కనీసం ఈ రెండవ సవరణ సందర్భంగా అయినా ఈ అంశాన్ని బిల్లులో చేర్చమని ఎవరూ అడగనే లేదు. ఈ రెండు సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మోడీ ప్రభుత్వం అసలే పరిగణనలోకి తీసుకోలేదు.
నిజానికి ఎపి పునర్వ్యవస్థీకరణ బిల్ ఆమోదం పొందేకంటే ముందే, బిల్లు మొత్తం ఎపికి అనుకూలంగా రూపొందింది కాబట్టి అందులోని లోపాలను సవరించమని తెలంగాణ ఉద్యమ నాయకత్వం కేంద్ర ప్రభుత్వ నాయకులను కోరింది. కాని వారు మీకు సవరణలు కావాలా? బిల్లు ఆమోదం కావాలా? అని నిలదీసినప్పుడు ఇక ఆ లోపాలతోనే బిల్లు ఆమోదానికి తెలంగాణ ఉద్యమ నాయకత్వం అంగీకరించక తప్పలేదు. బిల్లులోని లోపాలను సవరించే అవకాశాలు రెండుసార్లు వచ్చినప్పటికీ అప్పటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పటి కాంగ్రెస్, బిజెపి నాయకులు నిమ్మకునీరెత్తినట్టు ఉండిపోయారు తప్ప నోరువిప్పి అడగలేకపోయారు. ముఖ్యంగా సాగునీటి రంగానికి సంబంధించి పొందుపరచిన క్లాజుల్లో బిల్లులో తెలంగాణ పట్ల వివక్ష స్పష్టంగానే కనిపిస్తున్నది. మొదటగా ప్రస్తావించుకోవలసింది.. బిల్లులో క్లాజ్ 90 లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర పాలక వర్గాలకు తెలంగాణకు కూడా ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలన్న విచక్షణ లేకుండా పోయింది.
వారికి లేకున్నా తెలంగాణ నాయకులు ఎందుకు అడగలేకపోయినారు? అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అన్న సామెత ఉండనే ఉన్నది. అడిగే వాళ్ళు లేకపోతే కేంద్ర పాలక వర్గాలకు సోయి ఎక్కడనుంచి వస్తుంది? ప్రాణహిత -చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు అప్పటికే నిర్మాణంలో ఉన్నది. ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించమని డిమాండ్ చేసి ఉంటే రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరిగి ఉండేది. మహారాష్ర్ట అభ్యంతరాలకు అవకాశం ఉండేది కాదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కెసిఆర్ ప్రభుత్వం కూడా ప్రాణహిత- చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించమని మోడీ ప్రభుత్వాన్ని కోరింది. కాని వారు మన డిమాండ్‌ను పట్టించుకోనే లేదు. పైగా పోలవరం తర్వాత దేశంలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విధానం మాకు లేదు అని ఆనాటి కేంద్ర జలవనరుల మంత్రి నితీన్ గడ్కరీ పార్లమెంట్‌లోనే ప్రకటించారు. కాని ఆ తర్వాత గడ్కరీ ప్రకటనకు విరుద్ధ్దంగా బిజెపి పాలిత రాష్ట్రమైన కర్నాటకకు అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది.
బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లో కేన్ బెత్వా ప్రాజెక్టుకు, ఉత్తరాఖండ్‌లో లోకేశ్వర్ వ్యాసి ప్రాజెక్టులను కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించింది. ప్రాణహిత- చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోవడం వలన తలెత్తిన పరిణామాలు అందరికీ తెలిసినవే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని 2024లో కేంద్రాన్ని కోరడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుత సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు 17 మంది తెలంగాణ లోక్ సభ సభ్యులలో ఒక్కరంటే ఒక్కరు కూడా పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ క్లాజు చేర్చమని అడిగిన పాపాన పోలేదు. మన ప్రజా ప్రతినిధులకు ఆ సోయి ఉంటే కదా! ఇక రెండవది .. బిల్లులోని 11వ షెడ్యూల్‌లో 10వ పేరాలో 6 ప్రాజెక్టుల పేర్లు పేర్కొనడం జరిగింది.
వాటిని విభజన తర్వాత కూడా కొనసాగించుకునే వెసులుబాటు ఈ పేరా ద్వారా లభించింది. అవి ఎపికి చెందిన హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరునగరి, వెలుగొండ ప్రాజెక్టులు; తెలంగాణకు చెందిన కల్వకుర్తి, నెట్టెంపాడు మాత్రమే ఉన్నాయి. నిజానికి ఇది అసంపూర్తి జాబితా. అసెంబ్లీకి రిఫర్ చేసిన ముసాయిదా బిల్లులో ఈ పేరా లేదు. ఆ తర్వాత ఆంధ్రా నాయకుల ఒత్తిడి మేరకు హడావుడిగా తుది బిల్లులో చేర్చడం జరిగింది. ఇందులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమోదం పొందిన ఎస్‌ఎల్‌బిసి, పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేర్చలేదు. ఇవన్నీ కృష్ణా బేసిన్ ప్రాజెక్టులే. ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టుల ఊసే లేదు. ఈ అసంపూర్తి జాబితాను సవరించమని అడిగినప్పటికీ బెదిరించారు తప్ప తెలంగాణకు మేలు చేసే క్లాజులను పెట్టలేకపోయారు కేంద్ర పాలక వర్గాలు. రెండు సవరణల సందర్భంగా కూడా పేరా 10లో తెలంగాణ ప్రాజెక్టులను చేర్చమని అడిగిన వారు ఎవరూ లేరు.
ఇక మూడవది.. చట్టంలోని క్లాజ్ 89లోనే కృష్ణ జలాల నీటి పంపిణీ అంతర్రాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టం, 1956 సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ద్వారా జరగాలని పేర్కొని ఉంటే ఈనాడు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ వ్యవహారం పరిష్కారం అయి, రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సమసిపోయేవి. కేంద్ర పాలక వర్గాలు ఈ రకమైన క్లాజును పెట్టకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు ToRను మాత్రమే ప్రతిపాదించింది. ToR లో ప్రాజెక్టుల వారీగా నీటి పంపిణీ చెయ్యమని చెప్పిందే తప్ప రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయమని ఆదేశించలేదు. బిల్లులో ఈ లోపం కారణంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం, 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా విచారణకు ఆదేశాలు పొందడానికి తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు 9 ఏండ్లు కేంద్ర ప్రభుత్వంతో పోరాడవలసి వచ్చింది. ఎట్టకేలకు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అక్టోబర్ 2023లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అదనపు ToR జారీ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ విచారణ ఇంకా కొనసాగుతున్నది. తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో ఆ దేవుడికే ఎరుక.
ఎపి పునర్వ్యవస్థీకరణ బిల్లు క్లాజ్ 84 ప్రకారం జలవనరుల పంపిణీ కోసం రెండు స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. ఒకటి ఆపెక్స్ కౌన్సిల్. ఇందులో కేంద్ర జలవనరుల మంత్రి ఛైర్మన్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. దాని కింద రెండు.. కేంద్ర అధికారులు, రాష్ట్రాల అధికారులు ఉండే కృష్ణాపై ఒక బోర్డు, గోదావరిపై మరొక బోర్డు ఏర్పాటు అయినాయి. ఈ బోర్డులు నదీ జలాల పంపిణీతోపాటు ఈ నదీ బేసిన్లలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సిఫారసులు చేస్తూ అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఇస్తేనే కొత్తప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం. ప్రాజెక్టుల నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం, అగత్యం తెలంగాణకే ఉన్నది. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏకొత్త ప్రాజెక్టును కట్టుకోవాలన్న ఆంధ్ర ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలన్నమాట. ఇంతకంటే దౌర్భాగ్యం తెలంగాణకు ఇంకేమి ఉంటుంది? ఈ క్లాజు కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టుల నిర్మాణానికి రెండు రాష్ట్రాలు షికాయతులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ జల వివాదాలకు అంతులేకుండా పోయింది.
ప్రాజెక్టులకు అనుమతినిచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు కట్టబెట్టడమే తప్పు. కేంద్రంలో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే వ్యవస్థ ఎప్పటినించో జయప్రదంగా కొనసాగుతున్నది. అటువంటప్పుడు అపెక్స్ కౌన్సిల్ అవసరం ఏమిటి? అని ప్రశ్నిస్తూ ఈ క్లాజును తొలగించమని అడిగినాము. కాని ఆ క్లాజు అట్లాగే ఉన్నది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రావణ కాష్టంగా మండుతూనే ఉన్నాయి. అట్లే రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు, వివాదాలు ఉన్నవి కృష్ణా బేసిన్‌లోనే. గోదావరి బేసిన్‌లో ఉమ్మడి ప్రాజెక్టులు లేవు, జలవివాదాలు లేవు. గోదావరి బోర్డు ఏర్పాటు అక్కరలేదని కూడా ప్రతిపాదించాం. అయినా పని లేని గోదావరి బోర్డు ఏర్పాటు అయింది. ఇక కృష్ణా బోర్డు కూడా అన్నీ రివర్ బోర్డుల లాగానే నీటి పంపిణికే పరిమితం కావాలి తప్ప కొత్త ప్రాజెక్టుల అనుమతులకు సిఫారసులు చేసే అవసరం లేదు. ఆ పని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖదశాబ్దాలుగా చేస్తూనే ఉన్నది.
ఇకపోతే.. దేశంలో జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుల సంగతి చూద్దాం. అసలు జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టులు దేశంలో ఎన్ని ఉన్నాయని పరిశోధిస్తే తెలిసిన విషయాలు ఇట్లా ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏండ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు తమ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు, కొన్ని ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే జాతీయ ప్రాజెక్టులను ప్రకటించాయి. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ రికార్డుల ప్రకారం దేశంలో ఇప్పటి వరకు 17 జాతీయ ప్రాజెక్టులు మంజూరు అయినట్టుగా తెలుస్తున్నది. అందులో పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో రెండేసి జాతీయ ప్రాజెక్టులు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అసోం, కర్ణాటక రాష్ట్రాలలో ఒక్కో జాతీయ ప్రాజెక్టులు మంజూరు అయినాయి. హిమాచల్ /ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఒక ఉమ్మడి జాతీయ ప్రాజెక్టు మంజూరు అయింది.
దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 11 రాష్ట్రాలలో మాత్రమే జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలంగాణ సహా 17 రాష్ట్రాలలో జాతీయ ప్రాజెక్టులు లేవు. ఈ అంశంపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ చర్చ పార్లమెంట్‌కు చేరి అక్కడ కూడా సీరియస్ చర్చ జరగాలి. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది. ఈ సమంజసమైన కోరికను కేంద్రం మన్నించవలసిన అవసరం ఉన్నది. తెలంగాణతోపాటు జాతీయ ప్రాజెక్టులు లేని రాష్ట్రాలకు కూడా ఆ రాష్ట్రం కోరుకున్న ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి నిధులు సమకూర్చాలి. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలి. ఆ ప్రాజెక్టులు దేశఆర్థిక వ్యవస్థకు, దేశ ఆహార భద్రతకు దోహదం చేస్తాయి. ఆ మేరకు రాష్ట్రాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. దేశంలో కరువులను, వరదలను నివారిస్తాయి. ఇప్పటికైనా తెలంగాణకు మేలు చేసే సవరణలు ఎపి పునర్వ్యవస్థీకరణ బిల్లులో పొందుపరచడానికి తెలంగాణ సమాజం అటు కేంద్ర పాలక వర్గాలపై, ఇటు రాష్ట్ర పాలక వర్గాలపై ఒత్తిడి పెంచవలసిన అవసరం ఉన్నది. దేశంలో జల వనరుల అభివృద్ధికి సంబంధించి ప్రతీ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు మంజూరు చేసే విధానం అమలు కావడానికి పార్లమెంటు ఉభయ సభల్లో విస్తృతమైన చర్చ జరగడానికి తెలంగాణ సమాజమే పూనుకోవాలి.
- శ్రీధర్‌రావు దేశ్పాండే
94910 60585













