రాష్ట్రంలో జనగణన 2027 స్వీయ- నమోదు ప్రారంభం

లోక్ భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా శ్రీకారం

ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ పిలుపు

మన తెలంగాణ / హైదరాబాద్ : జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో స్వీయ నమోదు ప్రక్రియను ఆదివారం అధికారికంగా ప్రారంభించారు. లోక్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆన్‌లైన్ ద్వారా స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..  జనాభా గణన ఒక కీలక జాతీయ కార్యక్రమమని పేర్కొన్నారు. ఇది దేశంలోని జనాభా, వారి సామాజిక-, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించడంతో పాటు, సమర్థవంతమైన ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాదిగా నిలుస్తుందని తెలిపారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో విధానాల రూపకల్పనలో జనగణన ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు.

కచ్చితమైన సమాచారంతో లక్ష్యిత సంక్షేమ పథకాలు రూపొందించడమే కాకుండా, దేశ పురోగతిని సమర్థవంతంగా అంచనా వేయడానికి ఇది సహకరిస్తుందని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో ఇదే మొదటి జనాభా గణన కావడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుందని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం ఖచ్చితమైన డేటా సేకరణ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్వీయ గణన దశ ఏప్రిల్ 26 నుంచి మే నెల 10 వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది దేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ జనగణన కావడం విశేషం.

స్వీయ నమోదు ప్రక్రియ సులభం, సౌకర్యవంతం, వినియోగదారులకు అనుకూలంగా రూపొందించబడిందని తెలిపారు. తాను స్వయంగా ఈ ప్రక్రియను పూర్తి చేశానని, ఇది సరళంగా, సమర్థవంతంగా ఉందని గవర్నర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, కచ్చితమైన సమాచారం అందించి జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా బలమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెన్సెస్ డైరెక్టర్ భారతీ హోళికేరి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కె. శశి కిరణాచారి తదితరులు పాల్గొన్నారు.