హైదరాబాద్: త్యాగాల పునాదుల మీద  పార్టీ బిఆర్ఎస్ ఏర్పడిందని  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. దశాబ్దాలుగా, అన్యాయానికి గురై నెత్తురు మండిన జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా అని కొనియాడారు. తెలంగాణ భవన్ లో  బిఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండా కెటిఆర్ ఆవిష్కరించారు. సీనియర్ నేతలు పాల్గొన్నారు. జై కెసిఆర్, జై బిఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగుతుంది. కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. 25 సంవత్సరాల్లో అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బిఆర్ఎస్ అని స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడే సమస్యలకు చరమగీతం పాడవచ్చని కెటిఆర్ తెలియజేశారు. మాజీ సిఎం కెసిఆర్ 25 ఏళ్ల క్రితం జలదృశ్యంలో గులాబీ జెండా ఎత్తారని, 14 సంవత్సరాలు తెలంగాణ జాతిని పార్టీ ఐక్యం చేసిందని అన్నారు.

అడుగడుగునా పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బిఆర్ఎస్ అని రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు అధికార బాధ్యతలు ఇచ్చారని, రాష్ట్ర అవశ్యకతను బోధించి ఏకతాటిపైకి తెచ్చిన ఘనత కెసిఆర్ ది అని ప్రశంసించారు. పదేళ్ల పాటు అధికారమిస్తే బాధ్యతగా భావించి రాష్ట్రాన్ని అగ్రగామిగా కెసిఆర్ నిలిపారని, రెండున్నరేళ్లుగా అరాచక పాలనకు వ్యతిరేకంగా అణగారిన ప్రజల తరపున వారి గొంతుకై నిలిచి పోరాడుతున్నది బిఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణను పట్టాలెక్కించేందుకు మరోసారి పోరాటం చేస్తామని, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని అన్నారు. రెండున్నరేళ్లుగా పేదల పక్షాన పోరాడుతున్నామని, 25 ఏళ్లలో బిఆర్ఎస్ అరుదైన ఘనత సాధించిందని, తిరిగి కెసిఆర్ ను సిఎం చేయడమే బిఆర్ఎస్ శ్రేణుల లక్ష్యం అని అన్నారు. మధ్యాహ్నం కెసిఆర్ నేతలకు దిశా నిర్దేశం చేస్తారని, బిఆర్ఎస్ఓ  పార్టీ కాదు, ఓ విప్లవం అని కెటిఆర్ స్పష్టం చేశారు.