హైదరాబాద్: బిసి గురుకుల విద్యాసంస్థల్లో చదివి, ప్రతిభతో వివిధ ఉద్యోగాలను సాధించిన విద్యార్థులందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సోమవారం తన ఫేస్ బుక్ ఖాతాలో పొన్నం పోస్టు చేశారు. విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణకు ఇది ప్రతిఫలం అని, గ్రామీణ, పేద కుటుంబాల నుండి వచ్చి ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా గొప్ప విషయం అని ప్రశంసించారు. విద్యార్థులు సాధించిన విజయాలు మీ కుటుంబాలకు మాత్రమే కాకుండా మొత్తం బిసి సమాజానికి గర్వకారణమన్నారు. ఈ విజయాలు మరెంతో మంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని, ఇంకా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం బిసి విద్యార్థుల విద్య, ఉపాధి, సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, గురుకుల వ్యవస్థ ద్వారా నాణ్యమైన విద్య, పోటీ పరీక్షలకు మార్గదర్శకత్వం అందిస్తున్నామని పొన్నం తెలియజేశారు. ఇలాంటి విజయాలను విద్యార్థులకు మరింతగా చేరువ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల అందరి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరోసారి పొన్నం అభినందనలు తెలిపారు.