ఐపిఎల్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత తడబడిన ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు.. ఆ తర్వాత కీలక సమయంలో అద్భుతంగా రాణించారు. అనంతరం ఛేజింగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ట్రావిస్ హెడ్ 76, క్లాసెన్ 65, అభిషేక్ 45, సలీల్ 30 పరుగులతో రాణించారు. దీంతో 8 బంతులు మిగిలి ఉండగానే ఎస్‌ఆర్‌హెచ్ 249 పరుగులు చేసి వరుసగా ఐదో సారి విజయఢంకా మోగించింది. అయితే ఈ మ్యాచ్‌లో తమ జట్టు బ్యాటర్లపై కెప్టెన్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.

‘‘భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శుభారంభం అత్యంత ముఖ్యం. మా బ్యాటింగ్ లైనప్ గురించి తెలిసిందే కదా.. ఇక పిచ్ కూడా చాలా బాగుంది. మా చేతుల్లో నుంచి మ్యాచ్ చేజారిపోదని అనుకున్నాం. మా బ్యాటర్లు దాన్ని చేసి చూపించారు. మా ఓపెనర్లకు భయం అంటే తెలియదు. వారి దగ్గర చాలా భిన్నమైన షాట్లు ఉంటాయి. నా అదృష్టం ఏంటంటే.. వారిని నేను బౌలింగ్ చేయడం లేదు. వారిని చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇక మా కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. సలీల్ అరోరా ఫినిషింగ్ టచ్ బాగుంది. అతడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వలేకపోయాం. కానీ, ఎప్పుడు ఛాన్స్ వచ్చినా అందుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇదంతా కోచింగ్ స్టాఫ్‌కే క్రెడిట్ దక్కుతుంది’’ అని కమిన్స్ పేర్కొన్నాడు.