
మన తెలంగాణ/హైదరాబాద్: రిటైర్డ్ ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.14,200 కోట్ల పైచిలుకు బకాయిలను చెల్లించడానికి ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి 50 శాతం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. అయితే, 100 రోజుల్లోగా ఈ బకాయిలను చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్రంలో పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు నామినేట్ పద్ధతిన పాలకవర్గాలను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై హైకోర్టు వెలువరించిన తీర్పుకు సంబంధించి ఢిల్లీలోని న్యాయ నిపుణులతో సంప్రదించి, సుప్రీంకోర్టుకు వెళ్లాలా, లేదా అన్నది వారిచ్చే సలహాలు, సూచనల ఆధారంగా నడుచుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఆర్టీసి కార్మికులతో నేడు చర్చలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రివర్గం చర్చించింది. జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదు.
కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్పుబట్టలేదు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని అభిప్రాయపడింది. పిటిషనర్‌లకు నోటీసులు ఇవ్వలేదనే కేవలం సాంకేతిక కారణాలను హైకోర్టు తప్పుబట్టింది. ఈ నివేదికలో వారిపై ప్రస్తావించిన అంశాలు అమల్లో ఉండవని, వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే తీర్పునిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, లోపాలు, అక్రమాలపై సిబిఐ దర్యాప్తునకు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. తొమ్మిది నెలలైనా సిబిఐ దర్యాప్తు ఇంకా ప్రారంభం కాలేదు. హైకోర్టు తీర్పు సిబిఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకిగా లేదని న్యాయ నిపుణులు తెలియజేశారు. అందుకే సిబిఐ దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రభుత్వం తరఫున మరోసారి సిబిఐని కోరాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు త్వరలోనే ఢిల్లీలో సిబిఐ డైరెక్టర్‌ను సిఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కలవాలని నిర్ణయించారు.
బకాయిల చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలి
గతంలో పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఒక్క రూపాయి కూడా బకాయి లేదు. రిటైర్‌మెంట్ వయస్సు పెంచటంతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవటంతో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం ఈ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా వెంటనే వారికి ఇచ్చే బకాయిల చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.
రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.8 వేల కోట్లు
రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సినవి రూ.8 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిని వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి, అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అవసరమైతే తమ జీతాలు, ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల నుంచి 50 శాతం రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేయాలని మంత్రులందరూ ఉదారంగా ముందుకువచ్చారు. రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు, బాధ్యులను పిలిచి చర్చలు జరపాలని, వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వంద రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
పిపిపి పద్ధతిలో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి
గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పిపిపి) పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో 21 రకాల స్పోర్ట్‌కు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఔట్‌డోర్ స్టేడియం సామర్థ్యం 20 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించింది. స్విమ్మింగ్ పూల్ సామర్థ్యం పెంపుతో పాటు స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాకారులకు వసతి, శిక్షణ సౌకర్యాలు కల్పించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన 12 ఎకరాలను డెవలపర్స్‌కు ఇచ్చి కమర్షియల్ యాక్టవిటీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. కమర్షియల్ యాక్టవిటీ వల్ల వచ్చే ఆదాయాన్ని స్పోర్ట్ యూనివర్సిటీ నిర్వహణ, క్రీడాకారుల వసతి, శిక్షణ ఇతర కార్యక్రమాలకు వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు 85.10 ఎకరాల భూమి కేటాయింపు
మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మహాదేవ్‌పూర్, కాటారం, మల్హర్ రావు, మహముత్తారం మండలాల్లో దాదాపు 45 వేల ఎకరాలకు, 63 గ్రామాల ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం చేకూరుతుంది. భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2,427 ఎకరాల భూమి అవసరం. ఇప్పటివరకు 1,020 ఎకరాలను సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన 85.10 ఎకరాల భూమిని మత్స్య శాఖకు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.


