యాదాద్రి: మద్యం మత్తు అనేది ఎంత భయంకరమైనదో ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. చిన్న వయస్సులోనే యువత మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లేదా నేరాలు, హత్యలు చేస్తున్నారు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మేడిపల్లిలో మద్యం మత్తులో మధు(25) అనే యువకుడిని చరణ్, నవీన్ అనే యువకులు హతమార్చారు. ఈ నెల 21వ తేదీ రాత్రి నుంచి 22వ తేదీ ఉదయం వరకూ ముగ్గురు కలిసి నాలుగు ఫుల్ బాటిల్స్ మద్యం సేవించారు. అయితే అందులో చివర్లో వచ్చే లక్కీ డ్రాప్స్ తనకు రాలేదని మధు మిగితా ఇద్దరిపై దాడి చేశాడు. దీంతో విచక్షణ కోల్పోయిన చరణ్, నవీన్‌లు మధుపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భయంతో ఈ విషయాన్ని తన తల్లికి తెలిపాడు. దీంతో చరణ్ తల్లి అతడిని పోలీసులకు అప్పగించింది.