
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళుతున్న బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స కోసం జునాగఢ్ సివిల్ ఆసుపత్రులకు తరలించారు. అధికారులు సహాయక, తోడ్పాటు చర్యలను కొనసాగిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. భావనగర్ నుంచి ద్వారక, సోమనాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. మంగ్రోల్ పట్టణానికి సమీపంలోని రాహిజ్ గ్రామం వద్ద మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ జంతువు అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డంగా రావడంతో డ్రైవర్ వాహనంపై కంట్రోల్ కోల్పోవడంతో బస్సు బోల్తా పడిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.














