మన తెలంగాణ/తొగుట (దుబ్బాక): సిద్దిపేట జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో అదుపుతప్పిన కారు రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందారు. దుబ్బాక మండలం బల్వంతాపూర్‌కు చెందిన దండుగుల రాజు (30), ఆయన భార్య భాగ్య (25), కుమారుడు నిహార్ష్ (4), కుమార్తె శాన్విక (2) సిద్దిపేట నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో బావిలో నుంచి కారును బయటకు తీసి, మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో బల్వంతాపూర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి.