
న్యూఢిల్లీ: సమ్మతితో కలిసి ఉంటున్న వయోజనుల సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్) వివాహంతో సమానమైనదేనని, వారి నిర్ణయంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు జోక్యం చేసుకోవడానికి కానీ, వారి ప్రాణాలను బెదిరించడానికి కానీ హక్కు లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక జంట కోర్టును ఆశ్రయిస్తూ, కొంతకాలంగా కలిసి జీవిస్తున్న తాము భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది.
అయితే అమ్మాయి తండ్రి, సోదరుడు తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ సౌరబ్ బెనర్జీ విచారణ జరిపారు. సమ్మతితో కలిసి ఉంటున్న వయోజనుల సహజీవనం వివాహంతో సమానమైనదని పేర్కొంటూ.. అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న లివ్-ఇన్ రిలేషన్షిప్ జంటకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించారు.
ఈ సందర్భగా జస్టిస్ సౌరబ్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మతితో ఉన్న వయోజనులు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకుని, అతనితో లేదా ఆమెతో కలిసి నివసించే పూర్తి హక్కు ఉందన్నారు. వివాహ బంధం లేకపోయినా, వయోజనులు తమ ఇష్టానుసారం కలిసి జీవించే అపరిమిత హక్కు వారికి ఉందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని చెప్పారు. ఈ హక్కుకు ఇప్పుడు గృహహింస చట్టం, 2005లోని నిబంధనల కింద చట్టపరమైన గుర్తింపు కూడా ఉందని తెలిపారు.











