
చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆయన.. ప్రధాని మోడీని టెర్రరిస్టు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సమానత్వాన్ని విశ్వసించని వ్యక్తి(ప్రధాని మోడీ)తో AIADMK చేతులు కలపి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. "మోడీతోపాటు ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని విశ్వసించదు. అలాంటి వారితో వీరు చేతులు కలపడం అంటే, వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం" అని పేర్కొన్నారు.
ప్రధాని మోడీని ఉగ్రవాది అనడంతో ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. "బీజేపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలను, ముఖ్యంగా ఎన్నికల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వారు సిబిఐ, ఈడీ, ఐటి వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను కూడా లక్ష్యంగా చేసుకోగల శక్తివంతమైనది తమ ప్రభుత్వమేనని ప్రజలు భావించేలా, వారిలో భయాన్ని సృష్టిస్తున్నారు. ఆ సందర్భంలోనే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఆయన (మోడీ) స్వయంగా ఒక ఉగ్రవాది అని నేను ఎప్పుడూ అనలేదు. ఈ సంస్థలను ఉపయోగించుకుని ఆయన, ఆయన ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాత్రమే నేను చెప్పాను. నా ఉద్దేశం అదే" అని ఖర్గే అన్నారు.














