
తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాల వరకు వాడవాడలా ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అవగాహన కల్పిస్తారు. ఇందులో భాగంగా చదువు మానేసిన విద్యార్థులను తిరిగి బడిలోకి తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. మే 14వ తేదీ నుండి నిర్వహిస్తున్న బడి బాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడం, డ్రాప్ అవుట్‌లను తగ్గించడం, విద్యపై చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలను అధికారులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సంప్రదించారు. బడి బాట కార్యక్రమాన్ని తొలుత తల్లిదండ్రుల సమావేశాలతో ప్రారంభించి సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలతో ఒక ఉత్సవంగా నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ క్లాస్‌రూములు, ఇంగ్లీష్ మాధ్యమ బోధన, ప్రీ-ప్రైమరీ తరగతుల ఏర్పాటు వంటి చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, స్మార్ట్ బోధన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే మన ఊరు-మన బడి కార్యక్రమంతో పలు ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక రూపు సంతరించుకున్నాయి. అలాగే విద్యార్థులు ఆకలితో చదువు మానేయకుండా ప్రభుత్వం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను మరింత విస్తరించింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంతోపాటు అల్పాహారం కార్యక్రమాన్ని కూడా బలోపేతం చేస్తున్నారు.
విద్యార్థులకు ప్రభుత్వ హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థుల కాస్మెటిక్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సబ్బులు, నూనె, టూత్‌పేస్ట్, ఇతర వ్యక్తిగత అవసరాలకోసం విద్యార్థులకు అదనపు సహాయం అందుతోంది. హాస్టళ్లలో ఆహార నాణ్యత పెంపు, పరిశుభ్రత, భద్రత, ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. హాస్టళ్లలో కిచెన్ల ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది. ముఖ్యమంత్రితో సహా రాష్ట్రమంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత, హాస్టల్ వసతులు, ఆరోగ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నేరుగా హాస్టళ్లపై పర్యవేక్షణ పెంచడంతో పరిస్థితుల్లో మార్పు వస్తోందని తల్లిదండ్రులు భరోసాతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలివ్వడంతో 95 శాతంపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలు సాధించాయి. తెలంగాణ ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో పలు ప్రభుత్వ పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా మెరుగైన ప్రతిభ కనబరచడం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుకు నిదర్శనం. గురుకులాలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యాసంస్థలు ఉత్తమ ఫలితాలు నమోదు చేశాయి. చాలామంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సమస్యలు, ప్రైవేట్ విద్యా సంస్థల ఒత్తిళ్ల కారణంగా చదువు మధ్యలోనే మానేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ‘బడి బాట’తో డ్రాప్ అవుట్ విద్యార్థులను గుర్తించి వారందరినీ మళ్లీ విద్యా వ్యవస్థలోకి తీసుకురావడంపై అధికారులు దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ తర్వాత చదువు మానేసే పరిస్థితులను తగ్గించడంలో ఈ చర్యలు కీలకంగా మారుతున్నాయి.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోనే ఆదర్శవంతమైన రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థగా వీటిని తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకే క్యాంపస్‌లో స్కూల్, ఇంటర్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్రీడలు, డిజిటల్ లెర్నింగ్ వంటి సదుపాయాలు కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ రాష్ట్ర విద్యా విధానంలో సమగ్ర మార్పులు తీసుకురావడానికి విద్యావేత్త ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సూచనల అమలుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఒకే రకం సమగ్ర విధానాన్ని తీసుకురావడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనను విస్తరించడం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలను బలోపేతం చేయడంపై ఈ నివేదికలో కీలక సూచనలు ఉన్నాయి. విద్యను పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థ ఆధీనంలోకి వెళ్లకుండా ప్రభుత్వ విద్యను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆ నివేదిక ముఖ్య ఉద్దేశాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఇంటర్మీడియెట్ విద్య బలోపేతానికి కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా ఈసారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఫస్ట్ ఇయర్‌లో 66.20%, సెకండ్ ఇయర్‌లో 70.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. మైనారిటీ గురుకుల జూనియర్ కాలేజీల్లో 41 కాలేజీలు 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేయడం విశేషం. మొత్తం టిఎంఆర్‌ఇఐఎస్ జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్‌లో 81%, సెకండ్ ఇయర్‌లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఈ విద్యాసంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని సుమారు 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ఉపయోగపడనుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టేందుకు పోషకాహారం అవసరమనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాలు, రాగిమాల్ట్, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలనే ప్రణాళిక విద్యార్థుల ఆరోగ్యానికి తోడ్పడనుంది. పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కాలేజీలు మెరుగైన ఫలితాలు సాధించడం వల్ల ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలనే లక్ష్యంగా ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ వ్యవస్థల సమన్వయం, స్కూల్ నుంచి ఇంటర్ వరకు సమగ్ర విద్యా విధానం తీసుకురావడంపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విద్యార్థులపై అనవసర ఒత్తిడి తగ్గించి, విద్యను మరింత సమగ్రంగా మార్చాలనే లక్ష్యంతో కొత్త విధానాలను పరిశీలిస్తోంది. నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్, పోటీ పరీక్షలకు సిద్ధం చేసే విధంగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల భారం భరించలేని దశలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. రేవంత్‌రెడ్డి సర్కారు విద్యా రంగానికి ప్రాధాన్యతిస్తూ 2026- 27 బడ్జెట్‌లో రూ. 26,674 కోట్లు కేటాయించింది. మరోవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతోపాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల భారం తగ్గించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చే విధంగా ఫీజులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అక్రమ ఫీజులు, అదనపు వసూళ్లపై జిల్లా స్థాయిలో ఫిర్యాదు వ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నారు. దీంతో మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఊరట లభించడం ఖాయం. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలనుంచి ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్థులు వెళ్లే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పరిస్థితి క్రమంగా మారుతోంది. మెరుగైన సదుపాయాలు, ఉచిత విద్య, పోషకాహారం, హాస్టల్ వసతులు, మంచి ఫలితాలు, గురుకులాల విజయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల వైపు తల్లిదండ్రులు మళ్లీ మొగ్గు చూపుతున్నారు. బడి బాట కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు కొత్త ఊపు తీసుకొస్తుందనడంలో సందేహం లేదు.
ఐ.వి. మురళీకృష్ణ శర్మ














