
దాచారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గ్రామస్తుల రుణం తీర్చుకుంటానని గ్రామ సర్పంచ్ కర్నే జ్యోతి వీరేశం అన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన తనను ప్రజలు 799 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించడంతో పాటు గ్రామంలోని పదికి పది వార్డులలో కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులను గెలిపించి తమ బాధ్యతను మరింత ప్రజలు పెంచారని తెలిపారు. ఇది జిల్లాలో రికార్డు అని ఆమె పేర్కొన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు, మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు, పీహెచ్సీ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి మరొక 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. వీటి పనులను తాము త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. అంతేకాకుండా గ్రామంలోని రైతులు ప్రతి ఏటా తాము పండించిన ధాన్యాన్ని విక్రయించడానికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి ప్రభుత్వ భూమిలో శాశ్వత ఐకెపి సెంటర్ ను తన హయాంలో చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఇవి అన్నీ కూడా ప్రజల ఆశీస్సులతోనే తాను చేయగలుగుతున్నానని వినమ్ర పూర్వకంగా తెలిపారు. దాచారం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని పంచాయతీలను ఇలాంటి డిపాజిట్లు పెట్టకుండా ఇరువర్గాలతో మాట్లాడి పరిష్కరించడం జరిగిందని తెలిపారు. డిపాజిట్లు అనే సంస్కృతికి తాను పూర్తి వ్యతిరేకమని అన్నారు. గ్రామాల్లో ప్రజలు స్నేహపూర్వకంగా ఉండాలని సమస్యలు ఏమైనా వస్తే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలన్నదే తన అవిమతమన్నారు. అలా కాదు... కోర్టులు, కేసులు అంటే సమయం వృధా అవ్వడంతో పాటు మనశ్శాంతి కోల్పోతారు అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. తమ గ్రామంలో 2500 పై చిలుకు ప్రజలు ఉన్నారని ఇందులో ఓటర్లు 1996 మంది ఉన్నారని తెలిపారు. పేద ప్రజల కష్ట, సుఖాల్లో తాను ఎప్పుడూ ముందుంటానని ఆమె పేర్కొన్నారు. పదవులు ఉన్నా లేకున్నా పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. దాచారం సర్పంచ్ గా అవకాశం కల్పించిన ప్రజల రుణాన్ని తీర్చుకోవడానికి తాను నిరంతరం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.













