
హైదరాబాద్: ఆర్టిసి సమ్మె విషయమై ప్రభుత్వం నుంచి స్పందన లేదని జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న ఆరోపించారు. సమ్మెకు ఆర్టిసి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా స్పందన లేదని, ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టిసి విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలు పెట్టలేదని, ఆర్టిసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించట్లేదని విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టిసి ఆస్తులను ప్రైవేటుపరం చేసే యోచన ఉందని, ఆర్టిసిని హైదరాబాద్ లో లేకుండా చేయాలని చూస్తున్నారని తెలియజేశారు.
ఆర్టిసి భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే యోచన ఉందని, అద్దె బస్సుల నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని జెఎసి ఛైర్మన్ కోరారు. ఆర్టిసి ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని, ఆర్టిసి సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని, కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారని అన్నారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలని చూస్తున్నారని, ఆర్టిసిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమ వెనుక ఆర్టిసి కార్మికులు తప్ప మరెవరూ లేరని జెఎసి ఛైర్మన్ వెంకన్న పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారు? అని జెఎసి ఛైర్మన్ వెంకన్నప్రశ్నించారు.














