మేఘాలయ ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. స్టేట్- టు- స్టేట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు మంత్రి అక్కడి కార్యక్రమాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో మహిళా శిశు అభివృద్ధి రంగంలో మేఘాలయ అమలు చేస్తున్న పలు కీలక కార్యక్రమాలను మంత్రి అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా మిషన్ 1000 డేస్, ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలెప్‌మెంట్ కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి వంటి అంశాలను పరిశీలించనున్నారు. అలాగే మహిళా శిశు సంక్షేమంపై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇతర సాంకేతిక భాగస్వామ్య సంస్థలు నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ పర్యటనలో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజా కూడా మంత్రితో పాటు ఉంటారు. మేఘాలయలో అమలవుతున్న కార్యక్రమాల ద్వారా అంగన్వాడి కేంద్రాలను కేవలం పోషకాహార పంపిణీ కేంద్రాలుగా కాకుండా,

పిల్లల సమగ్ర అభివృద్ధికి వేదికలుగా మార్చుతున్నారు. మాతా శిశు ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యను కలగలిపిన సమగ్ర విధానంతో ఆ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందింది. తల్లిదండ్రులకు శిశు సంరక్షణ, పోషణపై అవగాహన పెంపు, రియల్‌టైమ్ మానిటరింగ్ కోసం డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థల వినియోగం, సంప్రదాయ అంగన్వాడి కేంద్రాలను హ్యాపినెస్ సెంటర్లగా మార్చడం వంటి చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి. గర్భిణీలు, శిశువులకు పోషకాహారం అందజేయడంతో పాటు, స్థానిక మహిళా సంఘాలు, సంక్షేమ, వైద్య, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంతో మేఘాలయ రాష్ట్రం అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలుసుకుని, తెలంగాణలో అంగన్వాడీ సేవలను బలోపేతం చేసే లక్ష్యంతో మంత్రి సీతక్క ఈ పర్యటన చేపడుతున్నారు.