న్యూఢిల్లీ: చెప్పడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నుంచి తమ స్థాయిలో పొదుపు చర్యలు చేపట్టారు. కాన్వాయ్ సైజ్ తగ్గించారు. ఇప్పుడు కేవలం రెండు వాహనాల కాన్వాయ్‌తోనే పర్యటించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశ ఆర్థిక రంగం క్లిష్ట పరిస్థితిలో పడుతోందని ప్రజలు పొదుపు పాటించాలని హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన సభలో ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు . ఇప్పుడు దీనిని ఆయన తరువాత అసోం, గుజరాత్ పర్యటనల దశలో కాన్వాయ్ సంఖ్యను కుదించుకోవడం ద్వారా నిరూపించారు.

అయితే అత్యవసరం అయిన భద్రతా ఏర్పాట్ల జోలికి వెళ్లకుండా కాన్వాయ్ కుదింపు జరిగింది. తమ కాన్వాయ్‌లోకి డీజిల్ పెట్రోలు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని ప్రధాని సూచించారు ఈ మేరకు వెంటనే తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాదారణంగా ప్రధాని కాన్వాయ్‌లో మెర్సిడెస్ అల్ట్రా లగ్జరీ కార్లు , రేంజ్ రోవర్లు , టయోటా ఫార్యునర్లు, ఎస్కార్ట్ కార్లు , జామరు యూనిట్లు వంటివి 15 వరకూ ఉంటాయి. అయితే వీటిలో సగానికి సగం తగ్గించాలని ప్రధాని బుధవారం ఉదయం ప్రత్యేక రక్షణ బృందం (ఎస్‌పిజి)కి సూచించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కాన్వాయ్ తగ్గింపు జరిగింది. అయితే ప్రోటోకాల్ ప్రకారం ప్రదాని వెళ్లే మార్గంలో భద్రతా ఏర్పాట్లు ఇప్పటిలాగానే ఉంటాయి. కాన్వాయ్ తగ్గింపు చర్యల తరువాత ఇప్పుడు గుజరాత్, అసోంలలో ప్రధాని మోడీ రెండు కాన్వాయ్‌ల్లోనే సాగినట్లు వెల్లడైంది. ప్రధాని మోడీ పాటిస్తున్న పొదుపు చర్యను కేంద్ర మంత్రులు , బిజెపి పాలిత ముఖ్యమంత్రులు, మంత్రులు విధిగా పాటించేందుకు సిద్ధం అయ్యారు. హోం మంత్రి అమిత్ షా కాన్వాయ్ ఇప్పుడు రెండుకు పరిమితం అయింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వెనువెంటనే స్పందించారు.

సగానికి సగం వాహనాలు తగ్గించాలని ఆదేశించారు. ప్రధాని బాటలో తాము సాగుతామని వెల్లడించారు. ఇకపై యుపిలోనే కాకుండా బిజెపి పాలిత రాష్ట్రాలు, మిత్రపక్షాల నేత ల కాన్వాయ్‌లు కూడా పటాపటోపాలకు దూరంగా సాగుతాయి. ఇంధన ఆదాకు దిగాల్సిందే అని, ఇతరత్రా కూడా జాతీయ స్థాయి సంక్షోభ నివారణకు పొదుపు మంత్రుం పాటించాలని అధికారులను యుపి సిఎం ఆదిత్యానాథ్ ఆదేశించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఢిల్లీ సిఎం రేఖా గుప్తా , రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కూడా వెంటనే పొదుపు చర్యలకు దిగారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తమ మంత్రులకు కీలక ఆదేశాలు వెలువరించారు. అదికారిక పర్యటనలకు హెలికాప్టర్లు, విమానాలు వాడే ముందు తనకు తెలియచేయాలని, తన అనుమతి లేకుండా వీటిలో వెళ్లరాదని అఢికారిక ఉత్తర్వులు వెలువరించారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరి ఇతర మంత్రులు కొందరు కూడా ఆదా చర్యలకు దిగారు. తమ వ్యక్తిగత కార్లను సగానికి సగం వాడరాదని వెంటనే ఆయన నిర్ణయించారు. పొదుపు మంత్రుం ఇప్పుడు బీహార్‌కు కూడా పాకింది. అక్కడ ఇద్దరు మంత్రులు లేషి సింగ్ షీలా మండల్‌లు తాము వెంటనే పొదుపు చర్యలకు దిగుతామని వెల్లడించారు.