
202627 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు 14 పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం ఆమోదం తెలి పింది. ఇందుకు రూ. 2.6 లక్షల కో ట్లు కేటాయించారు. ఇందులో సా ధారణ వరి ఎంఎస్‌పీని క్వింటాల్‌కు రూ. 72 పెంచి రూ.2,441గా నిర్ణయించింది. ఏ- గ్రేడ్ వరి ఎంఎస్‌పీని రూ.2,461గా ఖరారు చేసింది. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, పత్తి పంటలకు భారీగా ఎంఎస్‌పీ పెంపు ప్రకటించింది. పొద్దుతిరుగుడు గింజలకు క్వింటాల్‌కు అత్యధికంగా రూ.622 పెంచి రూ.8,343గా నిర్ణయించారు. పత్తి మధ్యస్థ రకం ఎంఎస్‌పీని రూ.557 పెంచి రూ.8,267గా, పొడవైన నారు రకాన్ని రూ.8,667గా ఖరారు చేశారు. నైజర్‌సీడ్‌కు రూ.515 పెంపుతో రూ.10,052గా, నువ్వులకు రూ.500 పెంపుతో రూ.10,346గా ఎంఎస్‌పీ నిర్ణయించారు. ఇతర నూనెగింజల్లో సోయాబీన్ (పసుపు) ఎంఎస్‌పీని రూ.380 పెంచి రూ.5,708గా, వేరుశెనగను రూ.254 పెంచి రూ.7,517గా ఖరారు చేశారు.
పప్పుధాన్యాల్లో కందిపప్పు (తూర్/అర్హర్) ఎంఎస్‌పీని రూ.450 పెంచి రూ.8,450గా, మినుములను రూ.400 పెంచి రూ.8,200గా నిర్ణయించారు. పెసర ధరను కేవలం రూ.12 పెంచి రూ.8,780గా ఖరారు చేశారు. ఇతర ధాన్యాల్లో జొన్న హైబ్రిడ్ రకానికి రూ.324 పెంపుతో రూ.4,023గా, మాల్దండి రకానికి రూ.4,073గా ఎంఎస్‌పీ నిర్ణయించారు. సజ్జలకు రూ.125 పెంపుతో రూ.2,900గా, రాగులకు రూ.319 పెంపుతో రూ.5,205గా, మొక్కజొన్నకు రూ.10 పెంపుతో రూ.2,410గా ఖరారు చేశారు.పెసరకు అత్యధికంగా 61 శాతం లాభ మార్జిన్ లభించనుండగా, సజ్జలు, మొక్కజొన్నలకు 56 శాతం చొప్పున, కందిపప్పుకు 54 శాతం మార్జిన్ లభించనుందని వెల్లడించారు. మిగతా పంటలకు 50 శాతం మార్జిన్ ఉండనుందని తెలిపారు. ఈ ఎంఎస్‌పీ పెంపుతో రైతులకు మొత్తం రూ.2.60 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని, వార్షిక కొనుగోలు పరిమాణం 824.41 లక్షల టన్నులకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
హైస్పీడ్ డబుల్ రైల్వే మార్గం
గుజరాత్‌లో అహ్మదాబాద్- ఢోలేరా మధ్య 134 కిలోమీటర్ల సెమీ హైస్పీడ్ డబుల్ రైల్వే మార్గ నిర్మాణానికి బుధవారం ఆమోదం తెలిపింది. రూ.20,667 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు భారతీయ రైల్వేల తొలి స్వదేశీ సాంకేతికత ఆధారిత సెమీ హైస్పీడ్ కారిడార్‌గా నిలవనుంది. అధికారిక ప్రకటన ప్రకారం, ఈ రైల్వే మార్గం అహ్మదాబాద్, ఢోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం, నిర్మాణంలో ఉన్న ఢోలేరా విమానాశ్రయం, లోథాల్ నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ల మధ్య వేగవంతమైన అనుసంధానం కల్పించనుంది. దీని ద్వారా అహ్మదాబాద్-ఢోలేరా మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి రోజువారీ రాకపోకలు సులభమవుతాయి.
వీటితో పాటు యూనియన్ క్యాబినెట్ నాగ్‌పూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్‌అథారిటీ ఆఫ్ ఇండియా భూమిని మిహాన్ ఇండియా లిమిటెడ్‌కు కేటాయించిన లీజ్ గడువును 2039 ఆగస్టు 6 తర్వాత కూడా పొడిగించేందుకు క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. దీంతో మిహాన్ ఇండియా లిమిటెడ్ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ నాగ్‌పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌కు అప్పగించే వీలు కలుగుతుందని అధికారిక ప్రకటనను వెల్లడించింది.














