న్యూఢిల్లీ : నీట్ పరీక్షా ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ) రంగంలోకి దిగింది. పలు ప్రాంతాలలో జరిపిన విస్తృత దర్యాప్తు , దాడుల క్రమంలో ఇప్పటికీ ఐదుగురు వ్యక్తులను సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ యుజి పరీక్ష 2026 లీక్ ఉదంతం విద్యార్థులు, యువజనుల తీవ్ర నిరసనకు దారితీసింది. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్ష పత్రాలు రాజస్థాన్ ప్రధాన కేంద్రంగా వేర్వేరు ప్రాంతాలకు చేరినట్లు నిర్థారణ అయింది. ఈ క్రమంలో సిబిఐ జైపూర్, గురుగ్రామ్, నాసిక్‌లలో ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ నిందితులన విచారిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ముగ్గురు సోదరులు మంగీలాల్ బివాల్, వికాస్, దినేష్‌లను కస్టడిలోకి తీసుకున్నారు.

గురుగ్రామ్‌లో జరిపిన గాలింపు చర్యల్లో యష్ యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శుభం ఖైర్మార్‌ను పట్టుకున్నారు. నాసిక్‌లో ఆయుర్వేద పట్టా పుచ్చుకున్న శుభంతో పాటు ఇక్కడనే మరో వ్యక్తిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, బీహార్ ఇటు మహారాష్ట్ర వరకూ నీట్ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాసిక్‌లో అరెస్టు తరువాత వారి విచారణ క్రమంలో తెలిసే విషయాలను బట్టి ఇతర రాష్ట్రాలలో అరెస్టులు, దర్యాప్తు వేగవంతం చేసేందుకు సిబిఐ సిద్దం అయింది. లీక్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఆయా ప్రాంతాల పోలీసుల సాయంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. నాసిక్‌లోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచే ప్రశ్నాపత్రం లీక్ అయిందని భావిస్తున్నారు. తొలుత రూ పది లక్షలకు బయటకు వచ్చిన ప్రశ్నాపత్రాలు తరువాత విపరీత రేటుకు అమ్ముడుపోయినట్లు గుర్తించారు.