పౌరులు ప్రభుత్వ బానిసలు కాదు, ఏదైనా సమస్యపై నిరసనలకు దిగితే వారిపై బహిష్కరణకు దిగుతారా? అని బొంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ వ్యక్తి అయినా నిరసనలు, ఉద్యమాల్లో పాల్గొంటే ఆంక్షలకు దిగే అధికారం ప్రభుత్వాలకు లేదని శుక్రవారం హైకోర్టు ఓ కేసు విచారణ దిశలో ఘాటైన రూలింగ్ వెలువరించింది. ముంబైలో స్థానిక రాజకీయ నాయకుడు పయీద్ అహ్మద్ వహీద్ చౌదరికి నగర బహిష్కరణ విధించింది. నిరసనల్లో తాను కేంద్రానికి, హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలకు దిగానని, దీనిని తీవ్రంగా పరిగణించి తనపై బహిష్కరణ విధించారని, ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని వహీద్ చౌదరి ముంబై హైకోర్టును ఆశ్రయించారు.

కేవలం నినాదాలకు దిగితే వెలివేస్తారా? ప్రజలు ప్రభుత్వాలకు జీ హుజుర్లు కొట్టే సేవకులు కాదు, పల్లకిలు మోసే బోయీలు కాదని పేర్కొన్న ముంబై హైకోర్టు బహిష్కరణ ఆదేశాలను కొట్టివేసింది . పిటిషనర్ చౌదరి స్థానిక సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పిటిషనర్ రాజకీయాల్లో ఉన్నందున తగు పార్టీలోకి దూకితే తనపై ఉన్న కేసులు అన్ని ఎగిరిపోయేలా చూసుకోవచ్చు అని సింగిల్ జడ్జి మాధవ్ జాందార్ చమత్కరించారు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలలో జోరుగా సాగుతున్న పార్టీల ఫిరాయింపుల విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. పవర్‌లో ఉన్న పార్టీ వైపు వెళ్లితే నేరాలు మాఫీ అవుతాయి కదా అని సరదాగా సూచించారు.