మనతెలంగాణ, సిటిబ్యూరో: పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ పోలీసుల విచారణకు బుధవారం డుమ్మా కొట్టాడు. పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాని భగీరథ్, పోలీసులకు మెయిన్ చేశాడు. తాను విచారణకు హాజరవుతానని రెండు రోజులు సమయం కావాలని, ఈ నెల 15వ తేదీన పోలీసుల ఎదుట హాజరై అన్ని వివరాలు చెబుతానని మెయిల్‌లో పేర్కొన్నాడు. వ్యక్తిగత ఇబ్బందుల వల్ల విచారణకు హాజరు కావడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు తనకు సమయం కావాలని పోలీసులను కోరాడు. కీలక ఆధారాలతో విచారణకు వస్తానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. విచారణకు హాజరై అవసరమైన సమాచారం, పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా, తక్కువ సమయం ఉండడం వల్ల హాజరు కాలేదని లేఖలో పేర్కొన్నారు. తనపై, తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలు తప్పుడువంటూ లేఖలో భగీరథ్ తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు కోసం రెండు రోజుల సమయం మంజూరు చేయాలంటూ సిట్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.


తన కూతురిని(17) వివాహం చేసుకుంటానని నమ్మించి మొయినాబాద్‌లోని ఓ షామ్ హౌస్‌కు తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తల్లి ఈ నెల 8వ తేదీన బండి సాయిభగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తన కూతురితో స్నేహం చేసిన భగీరథ్ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్‌కు తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథ్‌పై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్యువల్ అఫెన్సెస్ (పోక్సో)లోని సెక్షన్ 11 ఆర్/డబ్ల్యూ 12, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) లోని సెక్షన్ 74, 75 కింద కేసులు నమోదు చేశారు. డిసిపి రితిరాజ్ బాలిక స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేసిన తర్వాత పోక్సో -2012 చట్టంలోని సెక్షన్ 5 (ఐ), రెడ్ విత్ 6 సెక్షన్‌ను జోడించారు. ఈ కేసు సంచలనం సృష్టించడంతో ప్రభుత్వం కూకట్‌పల్లి డిసిపి రితిరాజ్ నేతృత్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని కరీంనగర్‌లోని బండి సాయి భగీరథ్ మేనమాకు డాక్టర్ వంశీకృష్ణకు నోటీసులు అందజేశారు.

హాజరు కాకపోతే...

పోక్సో కేసులో సిట్ విచారణకు హాజరు కాకపోతే సాయిభగీరథ్ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అరెస్టు వారెంట్ జారీ కావడం, మధ్యంతర బెయిల్ వచ్చినా రద్దు కావడం, పరారీలో ఉన్నవాడిగా గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతారు, కోర్టు నాన్- బెయిలబుల్ వారెంట్ జారీ చేవచ్చు. సిట్ విచారణకు హాజరు కాకపోతే మరిన్ని చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా సాయి భగీరథ్ కన్పించడంలేదని నగరంలోని పలు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లు అంటించారు.

బెయిల్‌పై నేడు విచారణ...

సాయి భగీరథ్ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ ధాఖలు చేసిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. బెయిల్ వస్తే విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని, రాకుండా హాజరయ్యేందుకు సాయిభగీరథ్ పోలీసులకు మెయిల్ పంపించినట్లు సమాచారం. బెయిల్ రాకుంటే పోలీసుల ఎదుట సాయిభగీరథ్ లొంగిపోనున్నట్లు తెలిసింది.

నాలుగు టీంలు ఏర్పాటు...

సాయి భగీరథ్‌ను పట్టుకునేందుకు డిసిపి రితిరాజ్ పోలీసులతో నాలుగు టీంలను ఏర్పాటు చేశారు. రెండు టీంలు కరీంనగర్, ఢిల్లీకి ఒకటీం, హైదరాబాద్ ఇంటి వద్ద ఒక టీంతో నిఘా పెట్టారు. సాయిభగీరథ్ పంపించిన మెయిల్‌పై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మెయిల్ భగీరథ్ పంపించాడా లేదా వేరే ఎవరైనా పంపించారా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.